CJI: శ్రీశైలేశ్వరుడికి సీజేఐ దంపతుల ప్రత్యేక పూజలు

by srinivas |
CJI: శ్రీశైలేశ్వరుడికి సీజేఐ దంపతుల ప్రత్యేక పూజలు
X

దిశ, శ్రీశైలం:ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను భారత ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ వై.చంద్రచూడ్, ఆయన సతీమణి కల్పనా దాస్, సుప్రీంకోర్టు జడ్జి పీఎస్ నరసింహ ఆయన సతీమణి సత్యప్రభ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈవో లవన్న, అర్చక స్వాములు, వేద పండితులు ఆలయ మర్యాదలు, మంగళ వాయిద్యాలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ దంపతులు రత్నగర్భ గణపతి స్వామి వారిని దర్శించుకుని హారతి అందుకున్నారు. తర్వాత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని రుద్రాభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మల్లికాగుండంలో (సరస్వతీ నదీ అంతర్వాహిని) ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు. భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన గావించారు.

అంతకుముందు సీజేఐ దంపతులు పల్లెంలో పుష్పాలు, ఫలాలను తలపై పెట్టుకుని స్వామి అమ్మవార్ల చెంతకు ప్రదర్శనగా వెళ్లారు. అనంతరం అర్చక స్వాములు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందచేశారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈఓ లవన్నలు స్వామి అమ్మవార్ల చిత్ర పటాలను అందచేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు, తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రార్ జనరల్ కె.సుజన, దేవాదాయ శాఖ కమిషనర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కర్నూలు ఎన్. శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed