AP Farmers Association: ప్రతి ఎకరాకు 15 వేలు బీమా ఇవ్వాల్సిందే

by srinivas |
AP Farmers Association: ప్రతి ఎకరాకు 15 వేలు బీమా ఇవ్వాల్సిందే
X

దిశ, దేవనకొండ: గత ఖరీఫ్‌కు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన పంటల బీమా జాబితా తప్పుల తడకగా, అస్తవ్యస్తంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. వెంటనే బీమా జాబితాను సవరించి గత ఖరీఫ్‌లో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 15 వేల రూపాయలు పంటల బీమా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కోటకొండ ఈదుల దేవరబండలో వర్షాభావ పరిస్థితులలో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన పంటల బీమా జాబితా రైతులకు ఏమాత్రం ఉపయోగపడని పద్ధతిలో ఉందన్నారు. కేవలం మొక్కుబడిగా బీమాను విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. దేవనకొండ మండలంలోని రెండు ఎకరాలకు పైగా ఉన్న రైతుకు 300 రూపాయలు మాత్రమే ఇన్సూరెన్సు వర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో వివిధ పంటలకు పంటల బీమా అమలు కాలేదన్నారు. దేవనకొండ, గోనెగండ్ల, గూడూరు, మద్దికేర, ఓర్వకల్లు మండలాల్లో పత్తి పంటకు బీమా రాలేదని మండిపడ్డారు. ఆలూరు, పత్తికొండ నియోజకవర్గంలో విస్తారంగా పండే టమోటా పంటకు కూడా బీమా అమలు కాలేదన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నా పంటల బీమా వర్తింప చేయకుంటే రైతు మనగడ కష్టమవుతుందని, ఇప్పటికే వ్యవసాయం భారమై రైతులంతా కూలీలుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed