కోనసీమ పసుపుమయం: లోకేశ్ ‘యువగళం’కు వెలసిన ఫ్లెక్సీలు

by Seetharam |   ( Updated:2023-11-26 09:46:49.0  )
కోనసీమ పసుపుమయం: లోకేశ్ ‘యువగళం’కు వెలసిన ఫ్లెక్సీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : నిన్న వరకు ఒకలెక్క.రేపు ఒకలెక్క.మెున్నటి వరకు ఒక పార్టీయే ఆయనకు ఘన స్వాగతాలు పలికేది కానీ నేడు అన్నీ మారిపోయాయి. సొంత పార్టీకి మరోపార్టీ తోడైంది. దీంతో ఆ యువ నేతకు ఘన స్వాగతం పలికేందుకు నాయకులు పోటీపడుతున్నారు. ఇంతకీ ఈ సినిమా డైలాగులు... స్వాగతాలు ఏంటి..ఒకపార్టీకి మరోపార్టీ తోడవ్వడం ఏంటి? అని అనుకుంటున్నారా? అదేనండీ నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో సరికొత్త పుంతలు తొక్కుకోబోతుంది. నారా లోకేశ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నిలిచిపోయింది. దీంతో యువగళం పాదయాత్రను లోకేశ్ పున:ప్రారంభించబోతున్నారు. అయితే గతంలో నిర్వహించిన లోకేశ్ యువగళం పాదయాత్ర వేరు... రేపటి నుంచి ప్రారంభించబతోన్న పాదయాత్ర వేరు. ఈ పాదయాత్రపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ ఆ ఉత్కంఠ ఎందుకు నెలకొందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

జనసేనతోపొత్తు అనంతరం...

తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు యువ నేత నారా లోకేశ్ సైతం వ్యూహరచన చేస్తున్నారు. అప్పట్లో ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాలతో వెళ్లే వారు. ఇదే సందర్భంలో నారా లోకేశ్ సైతం ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ‘యువగళం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జనవరి 7న చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ప్రారంభం అయ్యింది. అయితే సెప్టెంబర్ 9న స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు నారా లోకేశ్. ఈ పాదయాత్ర ప్రస్తుతం డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడలో నిలిచిపోయింది. ప్రస్తుతం ఆ పాదయాత్ర ఈనెల 27 నుంచి పున: ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ మాత్రమే సంఘీభావం ప్రకటించేది. ఆ పార్టీ నేతలు మాత్రమే పాదయాత్రలో పాల్గొనేవారు. కానీ చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉండగా జనసేనతో పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సాక్షిగా జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు.మరోవైపు నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్ సైతం జనసేనతో పొత్తు ఉందని వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

స్వాగతం పలికేందుకు ఇరు పార్టీల నేతలు పోటాపోటీ

తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు అనంతరం ఇరు పార్టీలు ఉమ్మడి కార్యచరణలో భాగంగా దూకుడు పెంచాయి. ఉమ్మడి మేనిఫెస్టోలో ఇరు పార్టీల కమిటీలు కసరత్తు చేస్తున్నాయి. అంతేకాదు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి సమన్వయ కమిటీలు సైతం తరచూ భేటీ అవుతున్నాయి. ప్రస్తుతం పలు అంశాలపై చర్చించారు. మరోవైపు నియోజకవర్గం స్థాయిలో నాయకులు సైతం ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీల ఆత్మీయ సమావేశాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇరు పార్టీల నేతలు బాహాబాహికి దిగారు. అయినప్పటికీ ఇరువురు కలిసి పనిచేస్తామని భరోసా ఇచ్చుపుచ్చుకున్నారు. ఇలాంటి తరుణంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్రను పున: ప్రారంభించబోతున్నారు. అదికూడా డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడలో ప్రారంభం కాబోతుంది. ఉభయగోదావరి జిల్లాలు జనసేన, టీడీపీ పార్టీలకు విపరీతమైన ఆదరణ కలిగిన జిల్లాలు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు స్వాగతం పలికేందుకు నేతలు పోటీపడుతున్నారు. అటు టీడీపీ ఇటు జనసేన నాయకులు స్వాగతం చెప్తూ ఫ్లెక్సీలు, కటౌట్లతో రోడ్లన్నీ నింపేస్తున్నారు. అటు టీడీపీ ఇటు జనసేన పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు సైతం ఫ్లెక్సీ, ఫోటోలు వేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. దీంతో రాజోలు నియోజకవర్గం నుంచి అమలాపురం వరకు రోడ్డు మార్గంలో భారీగా కటౌట్లు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి.

Advertisement

Next Story