కిక్కుకూ.. ఓ లెక్కుంది? అమ్మకాలు పెంచాలని సర్కారు టార్గెట్?

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-16 15:10:00.0  )
కిక్కుకూ.. ఓ లెక్కుంది? అమ్మకాలు పెంచాలని సర్కారు టార్గెట్?
X

దిశ, కర్నూలు ప్రతినిధి : ఎక్సైజ్ శాఖ సిబ్బందికి, మద్యం దుకాణాల్లో పనిచేసే సేల్స్‌మేన్‌లు, సూపర్‌వైజర్లకు రాష్ట్ర ఉన్నతాధికారుల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఆదాయాన్ని పెంచేలా ఒత్తిడి చేస్తూ ఇటు ఎక్సైజ్, అటు మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బందిని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రస్తుతం నూతన సంవత్సరం రాబోతున్నది, ఏడాది ముగింపు అయిన డిసెంబర్‌లో ఆదాయాన్ని మరింత పెంచాలని ఒత్తిడి తేవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేసేది లేక ఎక్సైజ్ అధికారులు టార్గెట్లు అధిగమించేందుకు గ్రామాల్లో బెల్టు షాపులకు దారులు వెతుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 183 మద్యం దుకాణాల్లో 732 మంది పని చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 95 మద్యం దుకాణాలు, 285 మంది సేల్స్ మేన్‌లు, 95 మంది సూపర్ వైజర్లున్నారు. నంద్యాల జిల్లాలో 88 మద్యం దుకాణాల్లో 264 మంది సేల్స్‌మేన్‌లు, 88 మంది సూపర్ వైజర్లు పని చేస్తున్నారు. ప్రస్తుతం వీరి ముందున్న టార్గెట్ లక్ష్యాలకు మించి మద్యం విక్రయాలను చేయడమే అని తెలుస్తున్నది. పని విధానంలోనూ వ్యత్యాసం ఉందని సమాచారం. నంద్యాల జిల్లాలో (పని సమయం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటలు) తప్ప మిగతా జిల్లాలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విధులను నిర్వహిస్తున్నారు.


అందుకు కారణం అధిక మొత్తంలో ఆదాయం పెంచడమేనని తెలుస్తున్నది. రాష్ర్టంలోని వివిధ శాఖలకు నిధుల కేటాయింపు కోసం, అనవసరమైన ఖర్చుల నేపథ్యంలో ప్రభుత్వం మద్యం ద్వారా అధిక ఆదాయాన్ని ఆర్జించాలనే యోచనకు వచ్చింది. దీంతో కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వదిలి అమ్మకాలను జరపాలని ఒత్తిడి చేస్తోందని తెలుస్తున్నది. నాణ్యత లేని, ఎవరికీ తెలియని బ్రాండ్లను అమ్మాలంటే సిబ్బందికి తలకుమించిన భారం అవుతున్నదని పలువురు పేర్కొంటున్నారు. తెలంగాణ, కర్నాటక వంటి రాష్ర్టాల సరిహద్దు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఏపీ మద్యాన్ని తాగడం లేదు. ఈ బ్రాండ్లు తాగితే రోగాల పాలు కావడం, కడుపులో మంట రావడం వంటి వాటితో ఇతర రాష్ర్టాలకెళ్లి అక్కడి మద్యాన్ని తాగుతున్నారు.

విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు

ప్రభుత్వం తీరుతో ప్రతి గ్రామంలోనూ బెల్టు దుకాణాలు వెలుస్తున్నాయి. ఆదాయాన్ని పెంచాలనే టార్గెట్లు ఇవ్వడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ మద్యం షాపుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు సిబ్బంది విక్రయాలు సాగిస్తే రోజుకు రూ.3 నుంచి 4 లక్షల ఆదాయం వస్తుందన్న వివరాలను ఉన్నతాధికారులకు చెబుతున్నారు. వారందించిన సమాచారం మేరకు విజయవాడ ఎక్సైజ్ శాఖ కార్యాయలం నుంచి ఫోన్లు వస్తున్నాయి. మరుసటి రోజు వీటికి మించి అమ్మకాలను చేయాలని ఆదేశాలు అందుతున్నాయి. అలా రాష్ర్టస్థాయి అధికారుల నుంచి ఫోన్ రాగానే జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు హడలి పోతున్నారు. సిబ్బందిపై మరింత ఒత్తిడి తెస్తున్నారు. బెల్టు దుకాణాలు, నాటుసారా స్థావరాలు, క్రయ విక్రయాలను నిలువరించాల్సిన అధికారులు బెల్టు దుకాణాలను ఏర్పాటు చేసుకుని ఆదాయాన్ని పెంచాలని చెప్పడం గమనార్హం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు వెలుస్తున్నాయి. జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు విధుల నిర్వహణ మరచి మద్యం విక్రయాలపైనే దృష్టి కేంద్రీకరించడం పలు విమర్శలకు తావిస్తున్నది.

పారదర్శకంగా పని చేస్తున్నాం

- రవి కుమార్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్, నంద్యాల

'' మద్యం దుకాణాల నిర్వహణలో సిబ్బందితోపాటు అందులో పని చేసే సూపర్ వైజర్లు, సేల్స్ మేన్‌లపై ఎలాంటి ఒత్తిడి లేదు. మద్యం అమ్మకాలన్నీ ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడూ నమోదవుతుంటాయి. అలాంటప్పుడు బెల్టు షాపులను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడా కూడా బెల్టు షాపుల నిర్వహణకు అనుమతి లేదు. ఎక్సైజ్ అధికారులెవరికీ టార్గెట్లు ఇవ్వడం లేదు. కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. సమయ పాలన విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే అమలు చేస్తున్నాం. జిల్లాలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేయాలని నిబంధన ఉంది. ఆ ప్రకారమే పని చేస్తున్నాం.''

Also Read....

ఇదీ సంగతి: అధికారమే అబద్ధం అడుతుందా?

Advertisement

Next Story

Most Viewed