- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్ జగన్ అధికారంలోకి రావాలనే చేశా: కోడికత్తి శ్రీనివాస్
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో ఎన్ఐఏ సంచలన విషయాలు బయటపెట్టింది. విశాఖ ఎయిర్ పోర్టులో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై నిందితుడు జనిపల్లి శ్రీనివాస రావు కోడికత్తితో దాడి చేశారు. ఆ దాడిలో జగన్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ కేసు అప్పటినుంచి ఎన్ఐఏ కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో కుట్ర కోణం ఏదీ లేదని వెల్లడించింది. సుదీర్ఘ దర్యాప్తు తరువాత ఆ విషయం స్పష్టమైందని ప్రకటించింది. ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ ప్రసాద్‌కు ఈ సంఘటనతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కూడా కాదని కుండబద్దలు కొట్టింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇక దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు కోడికత్తి దాడిలో కుట్రకోణం ఉందని లోతైన దర్యాప్తు జరపాలని ఈ నెల 10న సీఎం జగన్ తరపు న్యాయవాదులు పిటిషన్ వేయగా ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని ఎన్‌ఐఏ కోరింది. అయితే వాదనలకు రెండు రోజుల సమయం కావాలని జగన్ తరపు లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు కోర్టును కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఈనెల 17కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
జగన్‌కు సానుభూతి పెరుగుతుందనే దాడి చేశా: జనిపల్లి శ్రీనివాసరావు
కోడికత్తి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు వెల్లడించిన వివరాలు చార్జ్ షీట్, కౌంటర్‌తో పాటు ఈ-స్టేట్‍మెంట్‍ను ఎన్ఐఏ జత చేసింది. ఎన్ఐఏ విచారణలో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. తాను మొదటి నుంచి వైఎస్ఆర్ అభిమానిని అని వెల్లడించారు. జగన్ అధికారంలోకి రావాలని తాను కోరుకున్నానని అందులో భాగంగా ప్రజల్లో సానుభూతి కోసం జగన్‍పై అటాక్ చేసినట్లు వెల్లడించారు. ఇలా దాడి చేయడం ద్వారా జగన్‌పై సానుభూతి పెరుగుతుందని భావించానని, అందుకే దాడి చేసినట్లు విచారణలో వెల్లడించారు.‘ప్రమాదం జరగకుండా కోడికత్తిని 2 సార్లు స్టెరిలైజ్ చేయించా. జగన్‍కు టీ ఇచ్చేందుకు వెళ్లి ఈసారి ఎన్నికల్లో 160 సీట్లతో గెలుస్తారని కూడా ఆయనకు చెప్పాను. నా మాటలకు ఆయన చిరునవ్వు చిందించారు. అటాక్ జరిగిన వెంటనే వైసీపీ వారు నాపై దాడి చేశారు. పోలీసులు నన్ను కాపాడి ఓ గదిలో బంధించారు. అనంతరం పోలీస్‍స్టేషన్‍కు తరలించారు. అప్పట్లో ఆంధ్రా పోలీసులు నన్ను బాగా కొట్టారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారని విచారణ చేశారు. నా సొంత ఆలోచనతోనే దాడికి పాల్పడ్డానని చెప్పాను. ఎన్నిసార్లు అడిగినా ఇదే విషయం చెప్పాను. కట్టు కథలు చెప్పాలని పోలీసులు నాపై ఎటువంటి ఒత్తిడి తేలేదు. అందువల్లే జడ్జి దగ్గర నేను పోలీసులపై ఏ ఆరోపణలు చేయలేదు. ఇదే అంశంపై నేను 24 పేజీల పుస్తకం రాశాను. పుస్తకం పూర్తి చేద్దామంటే విశాఖ జైలు సిబ్బంది లాగేసుకున్నారు. ఈ సంఘటన తప్పు అని నాకు తెలుసు. జగన్‍కు అధికారం రావాలనే అభిమానంతో దాడికి పాల్పడ్డాను’ అని నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు ఎన్ఐఏ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
పిటిషన్ కొట్టేస్తే వైసీపీకి ఎదురుదెబ్బే
కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావును వైసీపీ ప్రభుత్వం బలి చేయాలని చూస్తోందని టీడీపీ ఆరోపిస్తుంది. ఎలాంటి కుట్రకోణం లేదని కూడా చెప్తోంది. నిందితుడు వైసీపీ సానుభూతి పరుడు కూడా అని తెలిపింది. అయినప్పటికీ వైసీపీ మాత్రం కుట్ర దాగి ఉందని ఆరోపించింది. ఈ కోడికత్తి దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని కూడా పదేపదే ఆరోపించింది. అయితే ఎన్ఐఏ విచారణలో ఎలాంటి కుట్రకోణం లేదని నిర్ధారణ అయ్యింది. దీంతో వైసీపీకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే టీడీపీపై చేసిన పలు ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో వైసీపీ ఇరుకునపడినట్లైంది. ఇక కుట్రకోణంలో విచారించాలంటూ సీఎం జగన్ తరఫు న్యాయవాది వేసిన పిటిషన్ కొట్టివేస్తే ఇక వైసీపీ ప్రభుత్వానికి ఇదొ పెద్ద ఎదురుదెబ్బ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇకనైనా బెయిల్ వచ్చేనా?
జనిపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ ఇప్పించాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నారు. తమ కుమారుడికి బెయిల్ ఇప్పించేందుకు సహకరించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ సీఎం జగన్ అపాయింట్మెంట్ మాత్రం ఖరారు కావడం లేదు.అయితే ఎన్ఐఏ విచారణలో ఎలాంటి కుట్రకోణం లేదు అని నిర్ధారణ అవ్వడంతో ఇకనైనా సీఎం జగన్ నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తల్లిదండ్రులకు అపాయింట్మెంట్ ఇచ్చి.. కేసు కొట్టివేయిస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఒకవేళ ఈ కేసు విషయంలో వెనక్కి తీసుకుంటే కోడికత్తి డ్రామా అనేది తెలిసిపోతుంది. దీంతో టీడీపీ వైసీపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేయకతప్పదు. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టీడీపీ ఇతర పార్టీలు ఇప్పుడు కోడికత్తి కేసును కూడా రాజకీయం చేసి వైసీపీని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే ప్రయత్నం కూడా జరగకమానదని తెలుస్తోంది.
Also Read..
చంద్రబాబు ఉండగానే రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తత