ప్రజల ప్రాణాలతో జగన్ రెడ్డి చెలగాటం: ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి

by Seetharam |
ప్రజల ప్రాణాలతో జగన్ రెడ్డి చెలగాటం: ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి
X

దిశ, డైనమిక్ బ్యూరో : గ్రామీణ వైద్యానికి 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన రూ.514 కోట్ల నిధులు దారి మళ్లించారని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజయనేయస్వామి ఆరోపించారు. సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ ప్రకారం పేదలకు ప్రాధమిక వైద్యం అందించడంలో దేశవ్యాప్తంగా ఏపీని 23వ స్థానానికి దిగజార్చారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ లో వైద్య రంగాన్ని 10వ స్థానానికి పడేశారు అని మండిపడ్డారు. 2019 మార్చి నాటికి ఒక వ్యక్తి ఆరోగ్యం కోసం చేసే ఖర్చు రూ.950 కాగా ఈ నాలుగున్నరేళ్లలో ఆ ఖర్చు రూ.4,000 వేలకు పెంచారన్నారు. ప్రభుత్వాసుపత్రులకు సర్జికల్, మందులు సరఫరా చేసే సంస్థలకు కోట్లలో బిల్లులు బకాయి పెట్టడంతో AIMED ఏకంగా ఏపీకి రెడ్ నోటీస్ ఇచ్చింది అని ఆరోపించారు. విజయవాడ హెల్త్ వర్సిటీ నిధులు రూ.400 కోట్లు దారిమళ్లించి ఖజానా ఖాళీ చేశారు అని మండిపడ్డారు. వైసీపీ మంత్రులు, ఎంపీలు వైద్యం కోసం పొరుగు రాష్ట్రానికి క్యూ కడుతుండటం రాష్ట్రంలో వైద్య రంగ దుస్థితికి అద్దం పడుతోంది అని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ఎద్దేవా చేశారు.

ఐసీయూలో సీఎంఆర్ఎఫ్

వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు అని ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు. రూ.1000 దాటితే ఉచిత వైద్యం పేదలకు ఎక్కడా అందడం లేదని చెప్పుకొచ్చారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ.1000 కోట్ల బకాయిలు పెట్టారు... ఆరోగ్యశ్రీ చికిత్సలకు ప్యాకేజీలు పెంచడంలేదు అని అన్నారు. దీంతో ఆరోగ్యశ్రీకార్డుదారులకు వైద్యం చేసేందుకు ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని చెప్పుకొచ్చారు.పేదలు ప్రైవేటు వైద్యం కోసం భారీగా వెచ్చించి అప్పులపాలవుతున్నారు అని ఓ ప్రకటనలో తెలిపారు. ఐ ప్యాక్ కనుసన్నల్లో పథకాన్ని పబ్లిసిటీ స్టంగ్ గా మార్చేశారు. వైద్య శిబిరాల నిర్వహణకు వైద్యశాఖ నుంచి పైసా కేటాయించకుండా పంచాయితీలపైనే ఆర్థిక భారం మోపుతున్నారని మండిపడ్డారు. 104, ఫ్యామిలీ డాక్టర్ కింద చేస్తున్న పరీక్షల ప్రక్రియకే పేరుమార్చి జగనన్న సురక్ష పేరుతో హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయని నాలుగున్నరేళ్లుగా ప్రచారార్భాటం చేశారు. కేవలం 5 మెడికల్ కాలేజీలే తీసుకొచ్చి వైద్య విద్యతోనూ నయా వ్యాపారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సర్కారీ కాలేజీల్లో మెడికల్ సీట్ల అమ్మడం ద్వారా బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. పేదలకు సంజీవనిగా ఉపయోగపడిన సీఎంఆర్ ఎఫ్ ను ఐసీయూలోకి నెట్టేశారు... ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఇచ్చే రీయింబర్స్ నూ కక్షపూరితంగా నిలిపేశారన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో సీఎంఆర్ ఎఫ్ కింద కేవలం 70 వేలమందికి రూ. 429 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు అని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.

పేదలకు చంద్రన్న ఆరోగ్య భాగ్యం

పేదల ఆరోగ్య పరిస్థితులు మెరుగు పరిచేందుకు 33 కొత్త పథకాలు నాడు చంద్రబాబు అమలు చేశారు అని ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి గుర్తు చేశారు. 2017-18లో నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో వైద్య రంగం అభివృద్ధిలో ఏపీ 4వ స్థానంలో నిలిచిందని...2014లో నాటికి ఏపీలో ఆరోగ్యం కోసం ఒక వ్యక్తి సగటున చేసే ఖర్చు 5,000 వేలు కాగా చంద్రబాబు తీసుకున్న చర్యల ద్వారా దాన్ని రూ. 950కి తగ్గించారని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా పీహెచ్ సీలు పనిచేశాయని చెప్పుకొచ్చారు. పీహెచ్ సీ మొదలు జిల్లా ఆస్పత్రి వరకూ ఎన్టీఆర్ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి 24 గంటల్లోగా రిపోర్టు అందజేశారని గుర్తు చేశారు. మదర్ మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమం ద్వారా మహిళలకు 70 రకాల పరీక్షలు నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌ను మంగళగిరికి తెచ్చి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని అన్నారు. మాతా,శిశువులకు ఉపయోగకరమైన తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్ల వంటి జగన్ రెడ్డి పథకాలను అటకెక్కించారు అని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed