తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్ దే: ఎంపీ బండి సంజయ్ ఫైర్

by Seetharam |   ( Updated:2023-08-21 11:29:04.0  )
తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్ దే: ఎంపీ బండి సంజయ్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘ఎవరైనా అభివృద్ధిలో, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో పోటీ పడతారు. కానీ కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల కోసం ఒకటి...రెండు...మూడు అని పోటీ పడ్డట్లుగా... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మాత్రం అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీ పడి దోచుకుంటున్నాయి’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ తన పదవీకాలంలో రూ.5 లక్షల కోట్ల అప్పు చేశానని చెప్తుంటే నేనేం తక్కవ? 10 లక్షల కోట్ల రూపాయలకుపైగా అప్పు చేశాను...ఏటా వడ్డీల పేరుతో 50 వేల కోట్లు చెల్లిస్తున్నాను’ అని ఏపీ సీఎం చెబుతున్నారు అని బండి సంజయ్ విమర్శించారు. డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలతో దోచుకుతింటున్నారు అంటూ ధ్వజమెత్తారు. మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన సర్కార్ ఈ ప్రపంచంలోనే లేదని..ఏపీ సర్కార్‌కే ఆ ఖ్యాతి దక్కుతుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఏపీలో అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోందని, కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. ‘ఓటర్ చేతన్ మహాభియాన్’’ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న బండి సంజయ్ కీలక ప్రసంగం చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరిసహా పలువురు నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఓటర్ చేతన్ మహాభియాన్ ఉద్దేశాలతోపాటు ఓటరు నమోదు విషయంలో ఏపీలో జరుగుతున్న అక్రమాలపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోంది. ప్రభుత్వంపట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. ఈసారి వైఎస్సార్ సీసీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రజల్లో భావన నెలకొంది. అయినా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమైంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉంది. అందులో భాగంగానే అనంతపురం జడ్పీ సీఈవోను సస్పెండ్ చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరంతా అప్రమత్తంగా ఉండాలి అని బీజేపీ శ్రేణులకు సూచించారు.

ఏపీలో బీజేపీ సత్తా చాటడం ఖాయం

బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టినందుకు తొలుత బండి సంజయ్ అభినందనలు తెలిపారు. పురంధరేశ్వరి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారని.. ఆమె నాయకత్వంలో ఏపీలో బీజేపీ సత్తా చాటడం ఖాయం అని అన్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీని హేళన చేసినట్లుగానే.... ఒకనాడు దేశంలో బీజేపీకి ఒక్క ఎంపీ కూడా లేరు? ఎట్లా అధికారంలోకి వస్తుందని హేళన చేశారు అని గుర్తు చేశారు. అయినా బీజేపీ కార్యకర్తలు వెనుకాడలేదు అని గుర్తు చేశారు. ‘2 ఎంపీలున్న పార్టీని ఈరోజు అధికారంలోకి రావడమే కాకుండా మోడీ నాయకత్వంలో రెండుసార్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినం. మూడోసారి అధికారంలోకి రాబోతున్నం. ఆనాడు బీజేపీని హేళన చేసిన పార్టీలన్నీ నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయినయ్. దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. ఏపీలో కూడా అవే పరిస్థితులు రాబోతున్నయ్. ఏపీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలున్నారు. మీరంతా పూర్తి సమయమిచ్చి కష్టపడి పనిచేస్తే ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది’ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.

అప్పుల్లో ఏపీ టాప్

ఏపీలో జగన్ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అప్పులు, అవినీతిలో ప్రగతి మాత్రమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. వడ్డీ రూపంలోనే ఏటా రూ.50 వేల కోట్లు చెల్లిస్తున్నారని అయినప్పటికీ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితుల్లో లేరు అని విమర్శించారు. పారిశుధ్య కార్మికులకు వేతనాలివ్వడం లేదు. అవినీతిలో, అప్పుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. మద్యం దరఖాస్తుల ద్వారానే రూ.2500 కోట్లకుపైగా సంపాదించానని కేసీఆర్ చెబుతుంటే... ఏకంగా మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని విమర్శించారు. గతంలో ఇదే వైసీపీ గత ఎన్నికల్లో దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చింది. అందుకు భిన్నంగా మద్యం బాండ్లతో అప్పు చేసుకునే దుస్థితికి దిగజారిందని మండిపడ్డారు. అంతేకాదు గంజాయి స్మగ్లర్ల కు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందని విమర్శించారు. దేశంలో అత్యధిక గంజాయి స్మగ్లర్లు ఏపీలోనే ఉన్నారని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఏపీ ఆదాయం 1 లక్షా 30 వేల కోట్లు అయితే.. అందులో 40 వేల కోట్లు కేంద్రమే ఇస్తోంది అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు.

భూమనకు పుష్ప సినిమా చూపించాలేమో

ఏపీలో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది అని బండి సంజయ్ ఆరోపించారు. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నరు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్లో అడగడుగునా ఆందోళన స్రుష్టిస్తూ రాకుండా చేస్తున్నారు. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా? వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలి అని బండి సంజయ్ హెచ్చరించారు. కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్ ఎవరండీ... ఆయన బిడ్డ పెళ్లి క్రైసవ ఆచార పద్దతిలో చేసిన మాట నిజంకాదా? నేను నాస్తికుడని ఆయన గతంలో చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా? ఇంకా సిగ్గు లేకుండా తిరుమలతో అడవులున్న విషయమే తెల్వదని టీటీడీ ఛైర్మన్ చెబుతున్నడట... మరి ఆయనకు‘పుష్ప’ సినిమా చూపించాలేమో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బొట్టు పెట్టుకున్నంత మాత్రాన, కంకణం కట్టుకున్నంత మాత్రాన హిందువులం కాదని తెలుసుకోవాలి. హిందూ మతాన్ని అడ్డుకునే వాళ్లను, హిందూ దేవతలకు అవమానం జరుగుతున్నా, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా పట్టించుకోకపోతే హిందువులం ఎలా అవుతాం? ఇవన్నీ పైవాడు చూస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని బండి సంజయ్ ఘాటుగా హెచ్చరించారు.

Advertisement

Next Story