కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం.. జగన్ వ్యూహంలో భాగమా?

by GSrikanth |   ( Updated:2023-06-23 03:11:09.0  )
కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం.. జగన్ వ్యూహంలో భాగమా?
X

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. వైఎస్​ జయంతి రోజున సోనియా లేదా రాహుల్​గాంధీ ఇడుపులపాయ రావొచ్చనే సమాచారం నెట్టింట హల్​చల్​చేస్తోంది. ఏపీసీసీ పగ్గాలు షర్మిలకు అప్పగిస్తారనే ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్​పుంజుకోవడానికి ఆమె రాక ఉపయోగం లేదని కాంగ్రెస్​వర్గాలు పెదవి విరుస్తున్నాయి. సీఎం జగన్​చర్యలతో వైఎస్సార్ ప్రతిష్ట జనంలో మసకబారింది. రాహుల్​గాంధీతో మళ్లీ జవసత్వాలను సమకూర్చుకుంటున్న కాంగ్రెస్​పార్టీకి షర్మిల చేరిక వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అన్నను విభేదిస్తే ఇక్కడ సొంత పార్టీ పెట్టకుండా తెలంగాణకు ఎందుకు వెళ్లారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్రంలో బీజేపీ లేదా కాంగ్రెస్​అధికారానికి వచ్చినా తనకు ఎలాంటి ఢోకా లేకుండా చేసుకునేందుకు జగన్​వేసిన ఎత్తుగడలో భాగమే షర్మిల రాక అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

దిశ, ఏపీ బ్యూరో: కొద్ది రోజుల కిందటే తెలంగాణలో షర్మిల పెట్టిన వైఎస్సార్​టీపీ.. కాంగ్రెస్‌లో కలిసిపోతుందనే వార్తలొచ్చాయి. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం సాధించడంతో షర్మిల బెంగళూరు వెళ్లి ఆ పార్టీ చీఫ్​డీకే శివకుమార్‌కు అభినందనలు తెలిపారు. అప్పుడే ఆమె సీఎం జగన్​ పంపితేనే వెళ్లినట్లు ఆరోపణలు విన్పించాయి. వైఎస్సార్​టీపీని కాంగ్రెస్‌లో కలిపేస్తారా అంటూ మీడియా సమావేశంలో అడిగితే.. అలాంటిదేమీ లేదని షర్మిల ఖండించారు. ఇటీవల ఏఐసీసీ నాయకుడు కేసీ వేణుగోపాల్.. షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కు ఫోన్ చేసి మాట్లాడడం.. రాహుల్ గాంధీ బర్త్ డే సందర్భంగా ఆమె ట్విట్టర్లో విషెస్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారాయి. వైఎస్ జయంతి జూలై 8న సోనియా లేదా రాహుల్ గాంధీ ఇడుపులపాయ వస్తారనే వార్తలు వస్తున్నాయి. షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు వైఎస్సార్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.

లేదు కాదు అంటూనే..

కాంగ్రెస్‌లో షర్మిల పార్టీని విలీనం చేస్తున్నారనే ప్రచారంతో ఇటీవల ఆమె స్పందించారు. అలాంటిదేమీ లేదని అన్నారు. తెలంగాణా రాష్ట్రానికి కోడలిగా వచ్చాను.. రాజకీయ భవిష్యత్తును ఇక్కడే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి ఆమె కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్​ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి సైతం షర్మిల తమ పార్టీలో చేరడంపై కొంత విముఖంగా ఉన్నారు. రాహుల్​ గాంధీ జోడో యాత్ర, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సంప్రదాయ కాంగ్రెస్​ విధానాలకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. ఆశ్రిత పెట్టుబడిదారులను దేశ చిత్ర పటం నుంచి తొలగించాలని రాహుల్​ పిలుపునిస్తున్నారు. క్రోనీ క్యాపిటలిస్టుల వల్లే దేశం దివాలా తీసిందని రాహుల్​ బల్లగుద్ది చెబుతున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్​ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కుటుంబం పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం పొందిందని లోకం కోడై కూస్తోంది. జగన్​ ఇప్పటికీ అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటూనే ఉన్నారు.

కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయంటే..

ఇలాంటి తరుణంలో షర్మిలకు ఏపీసీసీ పగ్గాలు ఇవ్వడం వల్ల రాహుల్​ గాంధీ ఇమేజ్​ దెబ్బతింటుందని ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఆమె నిజంగా జగన్‌తో విభేదిస్తే ఇక్కడే పార్టీ నెలకొల్పి ఎదురు దాడి చేసేవారు. అలాంటిది ఆమె తెలంగాణకు వెళ్లడంపై నాడు అనేక ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్​ పార్టీలో రెడ్డి సామాజిక వర్గంలో చీలిక తెచ్చేందుకు కేసీఆర్​ సహకారంతో పార్టీ నెలకొల్పినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు తోడ్పడుతుందని బీజేపీ కూడా పరోక్షంగా సహకరించినట్లు సమాచారం.

ఇదంతా ఆయన స్కెచ్చేనా?

ఇప్పుడు షర్మిలకు రాష్ట్ర పగ్గాలు ఇవ్వడం వల్ల పార్టీకి ఒనగూడే ప్రయోజనం లేకపోగా డిపాజిట్లు కూడా రావని కాంగ్రెస్​ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ పని అయిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ విపక్షాలతో కలిసి కేంద్రంలో కాంగ్రెస్ అధికారానికి వస్తే తనకు ఇబ్బందులు రాకూడదని సీఎం జగన్ వేసిన స్కెచ్‌లో భాగంగానే షర్మిలను కాంగ్రెస్‌లోకి పంపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది వాస్తవమైతే రాష్ట్రంలో కాంగ్రెస్ జవసత్వాలు పోసుకోవడం కష్టమని విశ్లేషకుల అంచనా.

Also Read:

కాంగ్రెస్‌లో విలీనం తర్వాత YS షర్మిలకు రాజ్యసభ!

Advertisement

Next Story