- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
22 ఏళ్లకే పీహెచ్‌డీ.. నైనా జైస్వాల్ అరుదైన ఘనత
దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ మరో అరుదైన ఘనత సాధించింది. 22 ఏళ్ళకే పీహెచ్‌డీ పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం నుంచి 22 ఏళ్లకే పీహెచ్‌డీ డిగ్రీ పూర్తి చేసి భారతదేశంలోనే మొదటి వ్యక్తిగా నిలిచారు. ఈ మేరకు గవర్నర్ కార్యలయంలో పీహెచ్‌డీ అవార్డును ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఆది కవి నన్నయ యూనివర్సిటీ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ అందజేశారు. ఈ సందర్భంగా నైనా జైస్వాల్‌ను గవర్నర్ అబ్ధుల్ నజీర్ అభినందించారు.
ఈ సందర్భంగా నైనా జైస్వాల్ మాట్లాడుతూ భారతదేశంలో 22ఏళ్ళ వయస్సులో డాక్టరల్ డిగ్రీ, పీహెచ్‌డీ పొందిన అతి పిన్న వయస్కురాలిగా, మొట్టమొదటి అమ్మాయిని అయినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ‘తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్ పాత్రపై అధ్యయనం' అనే అంశంపై నన్నయ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు మార్గదర్శకంలో విజయవంతంగా పరిశోధనను పూర్తి చేసినట్లు వెల్లడించారు. పీహెచ్‌డీ అవార్డుకు సహకరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రరెడ్డి, నన్నయ వీసీ ఆచార్య జి.వి.ఆర్ ప్రసాదరాజు, గైడ్ ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు, కోగైడ్ ఆచార్య ఎస్.టేకి, రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్, నన్నయ విశ్వవిద్యాలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
సివిల్ సర్వీసెస్‌కి వెళ్లాలనేది నా తపన
ఇకపోతే నైనా జైస్వాల్ లండన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి 8 ఏళ్లకే టెన్త్ పూర్తి చేసి ఆసియాలో అతి పిన్న వయస్కురాలుగా, 10ఏళ్ల వయస్సులో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, 13 సంవత్సరాల వయస్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి భారతదేశంలో పిన్న వయస్సులో పట్టభద్రురాలయ్యారు. ఆ తర్వాత ఎంఏ పూర్తి చేసి ఆసియాలోనే అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో 16 ఏళ్ళ వయస్సులో పిహెచ్.డి ప్రవేశం పొందానని..ప్రస్తుతం 22 ఏళ్ళ వయస్సులో విజయవంతంగా పిహెచ్.డి పూర్తి చేసినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ పరిశోధన చేసానని, స్వయం సహాయక బృందాలు మరియు మైక్రోఫైనాన్స్‌కు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, మహిళా సాధికారత పరంగా మైక్రోఫైనాన్స్ పాత్ర, ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనదని నైనా జైస్వాల్ తెలిపారు. పీహెచ్‌డీ పూర్తి చేసినందున సివిల్ సర్వీసెస్‌కి వెళ్లాలన్నది తన ఆశయమని నైనా జైస్వాల్ తెలిపారు. ప్రస్తుతం తన క్రీడా కెరీర్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. తాను చాలా అంతర్జాతీయ టోర్నమెంట్‌లు, కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా పాల్గొనాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా నైనా జైస్వాల్ పీహెచ్‌డీకి గైడ్ పూర్వ ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. నైనా మరిన్ని రికార్డులను సొంతం చేసుకొని భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే నైనాను స్పూర్తిగా తీసుకొని యువత అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నైనా తల్లిదండ్రులు అశ్విన్ కుమార్ జైస్వాల్, భాగ్యలక్షి, తమ్ముడు అగస్త్య పాల్గొన్నారు.