YCP: అసెంబ్లీపై కన్నేసిన ఎంపీలు.. జగన్‌కు విజ్ఞప్తుల వెల్లువ

by srinivas |   ( Updated:2023-04-10 15:46:57.0  )
YCP: అసెంబ్లీపై కన్నేసిన ఎంపీలు.. జగన్‌కు విజ్ఞప్తుల వెల్లువ
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంపీలంతా ఇప్పుడు రూటు మార్చారు. పార్లమెంట్‌కు వెళ్లమని, అసెంబ్లీకి వెళ్తామని తెగేసి చెప్తున్నారట. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు ప్రారంభించారు. జూన్ నెలలో మొదటి జాబితా విడుదల చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇంతలో ఎంపీలు సరికొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చారట. ఈసారి అసెంబ్లీకి వెళ్తామని చెప్తున్నారట. అంతేకాదు నియోజకవర్గాన్ని సైతం ఎంచుకుని అక్కడ సీటు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం వైఎస్ జగన్ పలువురు ఆశావాహులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగితే మరి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను ఎలా బుజ్జగిస్తారనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

అసెంబ్లీకే వెళ్తాం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో అసెంబ్లీలో 151 సీట్లను గెలుపొంది విజయ దుందుభి మోగిస్తే అటు పార్లమెంట్ నియోజకవర్గాల్లోను వీర విహారం చేసింది. ఏకంగా 22 ఎంపీ సీట్లను గెలుచుకుని రికార్డు సృష్టించింది. 22 మంది ఎంపీలలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా కొత్తవారే కావడం గమనార్హం. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామ కృష్ణంరాజు ఘన విజయం సాధించారు. ఎంపీగా గెలిచిన రెండేళ్లకే ఆయన పక్కలో బల్లెంలా తయారయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు దిగుతూ ఏకుమేకై కూర్చున్నారు. దీంతో పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును పక్కన పెట్టేసింది. వచ్చే ఎన్నికల్లో 21 మంది ఎంపీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు ఎంపీలు అసెంబ్లీ స్థానాలపై కన్నేశారు. ఈసారికి అసెంబ్లీకి పోటీ చేస్తామని ఎంపీలు అధినేత ఎదుట తమ మనసులో మాటను బయటపెట్టారట. అయితే కొందరికి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.

11 మంది ఎంపీల ఆశలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 22 మంది ఎంపీలలో ఒకరిని పార్టీ పక్కన పెట్టగా మిగిలిన 21 మందిలో 11 మంది వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే వీరిలో కొంతమంది ఎంపీలు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వారుకూడా ఉన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే సీట్లు ఖరారు చేస్తానని సీఎం జగన్ ప్రకటించేశారు. అందుకు కసరత్తు సైతం చేస్తున్నారు. దీంతో పలువురు ఎంపీలు తమ ప్రతిపాదనలను సీఎం వైఎస్ జగన్ ఎదుట పెట్టినట్లు తెలుస్తోంది. కాకినాడ ఎంపీ వంగా గీత ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా పని చేసిన ఆమెకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఇప్పటికీ పలువురు సైతం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆహ్వానం సైతం పలుకుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అరకు ఎంపీ మాధవి సైతం వచ్చే ఎన్నికల్లో లోక్‌సభకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ సైతం లోక్‌సభకు పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఈసారి రాజమండ్రి సిటీ లేదా రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆదాలకు లైన్ క్లియర్

ఇదిలా ఉంటే డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ చింతా అనూరాధ సైతం అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో అసెంబ్లీకి వెళ్లాలని భావించినప్పటికీ సీఎం జగన్ ఎంపీ టికెట్ ఆఫర్ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి వెళ్తానని ఆమె అనుచరుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లాలోని రాజోలు, పి.గన్నవరం, అమలాపురం ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే మూడు నియోజకవర్గాల్లో దాదాపు అభ్యర్థులు ఖరారైపోవడంతో ఆమె ఆశలు ఫలించేలా లేవని తెలుస్తోంది. అలాగేవిశాఖ ఎంపీ సత్యానారాయణ సీఎం జగన్ ఛాన్స్ ఇస్తే విశాఖ తూర్పు నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ నూజివీడు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. మరోవైపు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఉరవకొండ నియోజకవర్గం నుంచి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పత్తికొండ నుంచి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. అయితే ఎంపీ గోరంట్ల మాధవ్‌కు దాదాపు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని కూడా కన్ఫమ్ చేసినట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇకపోతే తిరుపతి ఎంపీ గురుమూర్తి గూడూరు నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ సైతం అసెంబ్లీ బరిలో నిలుస్తారని తెలుస్తోంది. మొత్తానికి సీఎం వైఎస్ జగన్ ఎవరికి ఏ టికెట్ ఇవ్వాలో డిసైడ్ చేయనున్నారు. మరి ఎంపీల ప్రతిపాదనలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

Read more:

అసెంబ్లీపై కన్నేసిన ఎంపీలు.. జగన్‌కు విజ్ఞప్తుల వెల్లువ

Advertisement

Next Story

Most Viewed