అంగన్వాడీల నిరవధిక సమ్మె: విరమించాలన్న ప్రభుత్వం..తగ్గేదేలే అంటున్న ఆందోళనకారులు

by Seetharam |
అంగన్వాడీల నిరవధిక సమ్మె: విరమించాలన్న ప్రభుత్వం..తగ్గేదేలే అంటున్న ఆందోళనకారులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : అంగన్‌వాడీల ఆక్రందన రెండో రోజు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు అంగన్వాడీల నిరవధిక సమ్మె కొనసాగుతుంది.అంగన్‌వాడీ వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో ఈ నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరవధిక సమ్మె విరమించుకోవాలని..లేకపోతే విధులకు గైర్హాజరైనట్లుగా భావించి చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ అంగన్వాడీలు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. నిరవధిక సమ్మెను విరమించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేవరకు.. తమకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు సమ్మెపై ప్రభుత్వం బెదిరింపులు ఆపాలని సూచించారు. ఇకపోతే అంగన్వాడీల ఆందోళనలకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఎఫ్ఐఏఎఫ్‌టీయూ సంఘాలు తమ మద్దతు తెలిపాయి.

అంగన్‌వాడీల డిమాండ్లు ఇవే

అంగన్వాడీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు పెంచాలని, చివరగా అందుకునే జీతంలో 50 శాతం పెన్షన్ ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్లు నిరవధిక సమ్మెకు దిగారు. సర్వీసులో ఉంటూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని..లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు అందివ్వాలని డిమాండ్ చేశారు. యఫ్ ఆర్ ఎస్ యాప్ రద్దు చేయడం, అంగన్వాడీ కేంద్రాల్లో 45 రోజుల పాటు వేసవి సెలవులు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. వీటితోపాటు కనీస జీతం రూ.26 వేలు, టీఏ, డీఏ బకాయిలను తక్షణమే చెల్లించడం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలుచేయాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడం, అన్ని కేంద్రాల్లోనూ కనీస సౌకర్యాలు కల్పించాలి అని డిమాండ్ చేశారు. వీటితోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమకు వర్తింపచేయాలని కోరుతూ అంగన్వాడీలు మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.

రెండోరోజూ ఆందోళనలు

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి అంగన్వాడీలు రోడ్డెక్కారు. తమన్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అంగన్వాడీలు సమ్మెలో పాల్గొన్నారు. కలెక్టరేట్లు, సబ్ కలెక్టరేట్లు, ఐసీడీఎస్ కేంద్రాల వద్ద అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, హెల్పర్లు ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలోని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో నిరవధిక సమ్మెలు కొనసాగుతున్నాయి.ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆందోళనకారులు తెలియజేశారు. ‘అంగన్వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం, మూతపడ్డవాటిని అంగన్వాడీలను తెరిపించాలి. హెల్త్ ఇన్స్యూరెన్స్ కల్పించాలి. రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలి’ అని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఆందోళనతో ఏపీ వ్యాప్తంగా 56 వేల సెంటర్లలో సేవలు నిలిచిపోయాయి. అంగన్వాడీల ఆందోళనకు కమ్యునిస్ట్ పార్టీలతోపాటు టీడీపీ తమ మద్దతు ప్రకటించాయి.


ప్రభుత్వం వార్నింగ్

అంగన్వాడీలు తలపెట్టిన నిరవధిక సమ్మెను విరమించాలని మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి మంగళవారం సాయంత్రం విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు ప్రస్తావించిన వివిధ అంశాలు సానుకూలంగా పరిశీలించినట్లు తెలిపింది. యూనియన్లతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంగన్వాడీలు, సహాయకుల వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని.. సర్వీసు చివరికి రూ. 50వేల నుంచి రూ.లక్ష పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హెల్పర్ల సర్వీసు చివరికి బెనిఫిట్‌ను రూ.20 వేల నుంచి రూ. 40వేలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. అంతేకాదు అంగన్వాడీలకు టీఏ, డీఏలను ప్రభుత్వ నిధుల నుంచి విడుదల చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. ఆమోదం తెలిపింది.

Advertisement

Next Story