Mangalagiri: చంద్రబాబు నోట కొత్త మాట.. పార్టీ నేతలకు కీలక సూచనలు

by srinivas |   ( Updated:2023-06-19 12:41:13.0  )
Mangalagiri: చంద్రబాబు నోట కొత్త మాట.. పార్టీ నేతలకు కీలక  సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మనస్సాక్షి లేని సైకో జగన్ రెడ్డి నాలుగేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇంతటి అవినీతి, నేరస్థుల పాలన తన రాజకీయ జీవితంలో చూడలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనను బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం నాయకులుగా తమ బాధ్యత అని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మహానాడులో ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టో "భవిష్యత్‍కు గ్యారెంటీ"పై బస్సు యాత్ర, ప్రచార కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ జరిగింది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ....‘నేను విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి మిగులు విద్యుత్ సాధిస్తే జగన్ రెడ్డి విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నాడు. కరెంటు చార్జీలు పెంచకుండా ఉత్పత్తి ఖర్చు తగ్గించాం. జగన్ రెడ్డి నాలుగేళ్లలో 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచాడు. మార్కెట్‌లో యూనిట్ రూ. 10 పెట్టి కరెంటు కొంటున్నారు అని ఆరోపించారు. మీటర్ల నుంచి సోలార్ ప్లాంట్ల వరకూ అంతా అవినీతే. ధరలు పెరిగి ఆదాయం తగ్గడానికి అసమర్థ ముఖ్యమంత్రే కారణం. దీపం పథకం తో నాడు సిలిండర్లు ఇస్తే నేడు జగన్ వంట గ్యాస్ ధరలు పెంచేశారు. భూముల ధరలు ఇంతలా పతనం కావడానికి జగన్ రెడ్డి కారణం కాదా? రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి దోచుకుతింటున్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి అవినీతికి పాల్పడుతున్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఎవరూ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారు. మహిళలు ప్రజా సమస్యలపై మాట్లాడితే వ్యక్తిగత విమర్శలకూ వెనకాడటంలేదు. మద్యపాన నిషేదం పేరుతో మాయమాటలు చెప్పి జే బ్రాండ్స్ తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంజాయి బ్యాచ్‌ను వైసీపీ పెంచి పోషిస్తోంది

గుడివాడలో టిడ్కో ఇళ్లు తానే కట్టించానని జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. నివాస యోగ్యమైన ఇళ్లను నేను కట్టిస్తే జగన్ రెడ్డి సెంటు భూమిలో ఇల్లు పేరుతో మోసం చేస్తున్నాడు అని మండిపడ్డారు. గంజాయి పెరిగిపోయిందని, ఢిల్లీకి వెళ్లి చెబితే టీడీపీ కార్యాలయంపై కూడా దాడి చేశారని గుర్తు చేశారు.‘ ప్రతిపక్ష కార్యాలయాలు, అధ్యక్షుడిపై దాడులు చేస్తే భయపడతారని భావించారు. టీడీపీ ఇలాంటి వాళ్లను ఎంతో మందిని చూసింది. అక్కను ఏడిపిస్తున్నారని ప్రశ్నించినందుకు గంజాయి తాగిన వెధవలు నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోలో పోసి తగలబెట్టేశారు. అలాంటి గంజాయి బ్యాచ్‌ను పెంచి పోషించింది ఈ జగన్ రెడ్డి కాదా?. జగన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా చేసే అర్హత ఉందా?. రాష్ట్రంలో ఎక్కడ చూసిన బ్లేడ్ బ్యాచ్, గన్ కల్చర్ చెలరేగిపోతున్నారు. రూ.40వేల కోట్ల ఆస్తులను గన్ చూపించి బెదిరించి లాక్కున్నారు. విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబాన్ని ఇంట్లో గృహ నిర్భందం చేసి డబ్బులు ఇవ్వమని గంజాయి తాగుతూ హింసించారని ఎంపీ కొడుకు స్వయంగా చెప్పారు. వైజాగ్‌లో గంజాయి బ్యాచ్ ఆగడాలు తట్టుకోలేక ఆ ఎంపీ హైదరాబాద్‌కు వెళ్లిపోతున్నారంటే జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?.’ అని నిలదీశారు. జగన్ రెడ్డి చేసిన తప్పుడు విధానాలే ఆయన పాలిట శాపాలుగా మారతాయని హెచ్చరించారు.

వైసీపీ హయాంలో ఊరికో సైకో తయారయ్యాడు

సత్యసాయి జిల్లాలో రూ.12 కోట్ల ఆస్తి బలవంతంగా కబ్జా చేసి రాయించుకుంటే ఎవరూ సాయం చేయక ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేవారు. మచిలీపట్నంలో ఆవుల సతీష్ అనే వైసీపీ నాయకుడు అమ్మాయికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడని, ఊరుకో వైసీపీ సైకో తయారయ్యాడని ధ్వజమెత్తారు. ‘అందుకే మనం ఇదేం ఖర్మ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. రాష్ట్రంలో భయంకరమైన సంఘటనలు రాబోతున్నాయని నేను ఏనాడో చెప్పాను. జగన్ రెడ్డి అవినీతిపై ప్రశ్నించిన మీడియాపై అక్రమ కేసులు పెట్టారు. తనను విమర్శిస్తే జగన్ రెడ్డి అరాచకం సృష్టిస్తున్నాడు. బాధితుల్ని బెదిరించే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. అవినీతి పరుడు, నేరస్తుడి చేతికి అధికారం ఇవ్వడం సమాజానికి శాపంలా మారింది. రాష్ట్రాన్ని కాపాడుకుని, రాష్ట్రానికి భవిష్యత్ కాపాడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తా తీసుకోవాలి. నిస్సహాయులుగా ఉన్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ శక్తి అందించేలా ఉండాలి.’ అని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ‘కిరాణా కొట్టు, పానీ పూరీ బండిలో సైతం డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి. కానీ ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపుల్లో ఎందుకు లేవో సమాధానం చెప్పాలి. తిరుపతిలో శ్రీ వాణి దర్శనం టికెట్లు కూడా క్యాష్ రూపంలోనే కలెక్ట్ చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. వెంకన్నకు అపచారం తలపెట్టే వారికి శిక్ష తప్పదని గుర్తుంచుకోవాలి. శ్రీవాణి ట్రస్ట్ ఎవరు నడుపుతున్నారు, ఆ డబ్బు ఎటుపోతోంది? నీచ రాజకీయాలకు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు.’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూపర్ సిక్స్ పాలసీతో రాష్ట్రాభివృద్ధికి బాటలు

సూపర్ సిక్స్ పాలసీలతో రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసుకుంటున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళల్ని మరింతగా గౌరవించుకోవాలనే లక్ష్యంతో మహాశక్తి పథకం తీసుకొచ్చినట్లు చెప్పారు. 18-59 మధ్య మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఎంత మంది ఉంటే అందరికీ ఇస్తామన్నారు. తల్లికి వందనంతో ప్రతి విద్యార్ధికి సంవత్సరానికి రూ.15వేల చొప్పున అందరికీ అందిస్తామని చెప్పారు. దీపం పథకం కింద సంవత్సరానికి నెలకు మూడు సిలిండర్లు అందిస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు. రూ.100 సంపాదిస్తే మరో వంద అప్పు చేసి పేదలకు రూ.20 ఇచ్చి రూ.180 దోచేస్తున్నాడు జగన్ రెడ్డి అని విమర్శించారు. యువగళం పథకంతో యువతకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు.

‘ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటులో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. అన్నదాతలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఇచ్చి వ్యవసాయానికి అండగా నిలుస్తాం. ప్రతి ఇంటికీ ఉచితంగా మంచినీటిని అందించి, ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం. విభజన తర్వాత విద్యుత్ సంక్షోభాన్ని టీడీపీ పరిష్కరించింది. అదే స్ఫూర్తితో అధికారంలోకి వచ్చాక ప్రత్యేక విధానాలు తీసుకొస్తాం. గతంలో పిపిపి మోడల్ లో హైదరాబాద్ అభివృద్ధి చేశాం. ఇప్పుడు పి-4 మోడల్ తో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తాం. సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ వ్యయం తగ్గించాం. కానీ జగన్ రెడ్డి వచ్చాక సోలార్, విండ్ ఒప్పందాలు రద్దు చేశారు. రైతులకు సోలార్, విండ్ విద్యుత్తుపై అవగాహన కల్పించి, మెరుగైన విధానాలు అమలు చేస్తాం. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తేనే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి.’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

పులివెందులలో మన జెండా ఎగరాలి

2014లో ఏపీ లోటు బడ్జెట్ రూ.16వేల కోట్లు.. 2018-19కి రూ.2 వేల కోట్లకు తగ్గించామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ నేడు జగన్ రెడ్డి అసమర్ధ విధానాలతో రూ.40 వేల కోట్లకు లోటు బడ్జెట్ చేర్చారని ధ్వజమెత్తారు. ‘సంపద సృష్టించే పోలవరాన్ని నాశనం చేశారు. అమరావతిని అటకెక్కించారు..పరిశ్రమల్ని తరిమేశారు, అభివృద్ధి దూరం చేశారు. రాష్ట్రం ఉత్తర, దక్షిణ కోరియా దేశాల్లా తయారైంది. దేశంలో నంబర్ 1 డ్రగ్ రాష్ట్రంగా ఏపీ తయారైంది. ప్రభుత్వమే విచ్చలవిడిగా డ్రగ్స్ వ్యపారాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రజాచైతన్యంతో ఎంతటి నియంతనైనా ఎదుర్కోవచ్చు. అదే చైతన్యంతో జగన్ రెడ్డిని ఎదుర్కోవాలి. 175 సీట్లలో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి. కుప్పంలో లక్ష మెజారిటీ గెలుపే లక్ష్యం. ప్రజా చైతన్యంతో ఊహించని ఫలితాలు సాధించవచ్చు.’ అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

‘ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది పోటీ వద్దన్నారు. కానీ పోటీ చేసి బంఫర్ ఫలితాలు సాధించాం. పులివెందుల ఎమ్మెల్సీ గెలిచాం. ఎమ్మెల్యే స్థానం కూడా గెలవాలి. పంచుమర్తి అనురాధ రెండుసార్లు అవకాశం కోల్పోయారని ఈసారి అవకాశం ఇచ్చాం. ఈ విజయం సాధించకపోతే రాబోయే ఎమ్మెల్సీ స్థానాలకు ఆమెకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పాం. కాఫీ ఖర్చు లేకుండా అనురాధని గెలిపించారు. అది తెలుగుదేశం పార్టీ సత్తా. అభ్యర్ధులకు అద్భుతమైన ఆయుధాలు అందజేస్తున్నాం. ఆ ఆయుధాలతో ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వధ చేయాలి. కౌరవ సభను గౌరవ సభగా మార్చాలి. రాష్ట్రం కోసం ఈ యుద్దానికి ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలి.’ అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

పబ్జీ ఆడుకునే వ్యక్తి వైఎస్ జగన్

తండ్రిని చంపి తండ్రి లేని బిడ్డను నాకు క్షమాబిక్ష పెట్టమనే జడ్జిని వేడుకునే క్రూరమైన నేరస్తుడు కరకట్ట కమలహాసన్ జగన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ‘చేతగానివాళ్లే వ్యక్తిగత విమర్శలు చేస్తారు. నా వయసు గురించి మాట్లాడుతున్నారు. నేను చేసే పనిలో 20 శాతం కూడా జగన్ రెడ్డి చేయలేడు. రాత్రి అయితే పబ్జీ ఆడుకునే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. ఆయననేమి ఈ రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడు?. పార్టీ నాయకులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజాసమస్యలపై అధ్యయనం చేసి పార్టీకి రిపోర్టు ఇవ్వాలి. దాన్ని బట్టి పార్టీ మేనిఫెస్టో తయారుచేస్తాం. రాబోయే ఏడు నెలలు చాలా కీలమైనవి. నేతలందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలి. 175కి 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయాలి.’ అని చంద్రబాబు నాయుడు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు.

Also Read...

తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఏపీలో 100 ఎకరాలు కొనొచ్చు: బాబు కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story