Nandigam Suresh: నా ప్రమేయం లేదు.. వాళ్లే గొడవ చేశారు..

by srinivas |
Nandigam Suresh: నా ప్రమేయం లేదు.. వాళ్లే గొడవ చేశారు..
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో జరిగిన గొడవపై ఎంపీ నందిగం సురేశ్ స్పందించారు. సత్యకుమార్‌పై దాడి ఘటనలో తన ప్రమేయం లేదని ఆయన చెప్పారు. దాడి జరిగేటప్పుడు తాను లంక పొలాల్లో ఉన్నానని తెలిపారు. తాను వెళ్లేటప్పటికే గొడవ మొత్తం జరిగిందన్నారు. అటు బీజేపీ నేతలపై నందిగం సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్లే గొడవ చేసేందుకు అక్కడికి వెళ్లారని ఆరోపించారు. ఇళ్లకోసం ధర్నాలు చేస్తున్న వారిపై దాడి చేస్తారా? అని మండిపడ్డారు. మహిళలను కూడా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. టీడీపీ డైరెక్షన్‌లోనే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని నందిగం సురేశ్ ఆరోపించారు.

కాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. మూడు రాజధానుల శిబిరం సమీపంలో సత్యకుమార్ వాహనంపై దుండగులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈదాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో మూడు రాజధానుల శిబిరం నిర్వహిస్తున్నారు. శిబిరంకు ఎంపీ నందిగం సురేశ్ మద్దతు తెలిపేందుకు వచ్చారు. అదే సమయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ అటుగా వెళ్తుండగా ఆయన కారును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సత్యకుమార్ కారు అద్దాలు పగలగొట్టారు. సత్యకుమార్ కారుకు అడ్డంగా నిలబడి నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు సైతం కారు దిగి ప్రతిఘటించారు. దీంతో వైసీపీ, బీజేపీ నేతలు కొట్టుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం పోలీసుల సాయంతో సత్యకుమార్ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Next Story