మొన్న చిలకలూరిపేట.. నిన్న నరసరావుపేట.. ఐసీఐసీఐ బ్రాంచుల్లో ఏం జరుగుతోంది?

by Y.Nagarani |   ( Updated:2024-10-08 01:49:43.0  )
మొన్న చిలకలూరిపేట.. నిన్న నరసరావుపేట.. ఐసీఐసీఐ బ్రాంచుల్లో ఏం జరుగుతోంది?
X

దిశ, నరసరావుపేట: చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్రాంచ్ తరహాలోనే, ఆ బ్యాంకు నరసరావుపేట బ్రాంచ్‌లో కూడా స్కాం జరిగినట్టు బయటపడింది. సోమవారం బ్యాంకు ఉన్నాతాధికారులు నరసరావుపేటకు వచ్చారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, కొందరు ఖాతా దారులు తమ ఎఫ్డీఆర్ వివరాల గురించి అడిగారు. వాటిని తనిఖీ చేసిన బ్యాంకు సిబ్బంది, అవన్నీ ఫేక్ అని బయటపడింది. బ్యాంకు రికార్డులలో నమోదు కాలేదని అనడంతో, ఖాతాదారులు ఖంగుతిన్నారు. రెండునెలల క్రితం వరకు ఎఫ్డీఆర్‌కు వడ్డీ వచ్చిందని, ఇప్పుడు ఫేక్ అంటే ఎలా అని జి.వేంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించారు. వెంటనే ఆయనను సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపేశారు. అనంతరం ఆయన విలేకరులతో కుటుంబ సభ్యుల పేరుతో ఈ బ్యాంకులో రూ.65 లక్షలు ఎఫ్డీఆర్ చేశామని, రెండు నెలల క్రితం వరకు ఆ మొత్తంపై వడ్డీ కూడా వచ్చిందని వివరించారు. ఇప్పుడు లేవని చెబుతున్నారని, ఈ కుంభకోణంలో మాజీ మేనేజర్ నరేశ్, పలువురు బ్యాంకు సిబ్బంది పాత్ర ఉన్నట్టు ఆరోపించారు.

ఈయనతో పాటు రత్నవర ప్రసాద్ రూ.50 లక్షలు, పిచ్చయ్య రూ.16 లక్షలు, కె ఎల్.రాజు రూ.8 లక్షలు, జగన్నాథం, జి.లక్ష్మి రూ.5 లక్షల చొప్పున చేసిన ఎఫ్డీఆర్ డబ్బులు లేవని బ్యాంకు సిబ్బంది చెప్పినట్టు తెలిసింది. వీరు కాక చాలా మంది ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి తమ నగదు గురించి వివరాలు తెలుసుకునే పనిలోపడిపోయారు. ఇంకా చాలా మంది ఖాతాదారులు బ్యాంకు చేరుకుంటుండటంతో, అధికారులు అందరినీ రేపు రమ్మని చెప్పి వెళ్లిపోయారు. నరసరావుపేట బ్రాంచ్‌లో రూ.10 కోట్ల కుంభకోణం జరిగినట్లు ప్రచారం జరుగుతుండగా బ్యాంకు సిబ్బంది నోరు మెదపడం లేదు. మంగళవారం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed