YSR Law Nestham: జూనియర్ లాయర్ల ఖాతాల్లోకి రూ.25 వేలు

by srinivas |   ( Updated:2023-06-26 12:40:04.0  )
YSR Law Nestham: జూనియర్ లాయర్ల ఖాతాల్లోకి రూ.25 వేలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ లా నేస్తం లాంటి పథకం దేశంలో ఎక్కడా అమలులో లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. యువ న్యాయవాదులకు అండగా ఉంటూ వైఎస్ఆర్ లా నేస్తం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన పేర్కొన్నారు. అడ్వకేట్లకు మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్‌ ట్రస్టును ఏర్పాటు చేసిన‌ తమ ప్రభుత్వం వైఎస్ఆర్ లా నేస్తం పథకంలో భాగంగా ఆర్థికపరమైన ప్రోత్సహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ 2023-24 సంవత్సరానికి మొదటి విడత వైఎస్ఆర్ లా నేస్తం నిధులు సోమవారం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ. 5,000 స్టైఫండ్ చొప్పున ఫిబ్రవరి, 2023 - జూన్, 2023 (5 నెలలు)కు ఒక్కొక్కరికి రూ. 25,000 ఇస్తూ, మొత్తం రూ. 6,12,65,000ను బటన్ నొక్కి జమ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ డా.కేఎస్ జవహర్‌ రెడ్డి, లా సెక్రటరీ జి.ప్రభాకర్, ఇతర అధికారులు, న్యాయవాదులు హాజరయ్యారు.

పేదలకు మేలు చేయండి

‘న్యాయవాదులు లా కోర్సు పూర్తి చేసిన, మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే చదువులు పూర్తి అయి, కోర్టుల్లో అడుగుపెడుతున్న పరిస్థితుల్లో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేందుకు, వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెలా రూ.5 వేలు, ఏడాదిలో రూ.60 వేలు ఇస్తున్నాం’ అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.80లక్షలు ఇస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ చెప్పారు. 4 ఏళ్లలో 5,781 మందికి రూ.41.52 కోట్లు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు న్యాయవాదుల కోసం రూ.100 కోట్లతో వెల్ఫేర్ ట్రస్టు ఏర్పాటు చేసిన రాష్ట్రం కూడా మనదేనని సీఎం జగన్ చెప్పారు. మెడిక్లెయిం కాని, న్యాయవాదుల అవసరాలకు రుణాలు వంటివాటికి, ఈ ఫండ్‌ నుంచి రూ.25 కోట్లు సహాయం చేయడం జరిగిందని సీఎం జగన్ వివరించారు. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన న్యాయవాదులు భవిష్యత్‌లో పేదలపట్ల కనికరం చూపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి పేదవాడికి తిరిగి బదిలీ అయ్యేటట్టుగా గుర్తుపెట్టుకోవాలని సీఎం జగన్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed