Ap Womens Commission: అది హత్య కంటే దారుణం.. ట్రోల్స్‌పై తీవ్ర ఆగ్రహం

by srinivas |   ( Updated:2023-06-30 11:51:17.0  )
Ap Womens Commission: అది హత్య కంటే దారుణం.. ట్రోల్స్‌పై తీవ్ర ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా నిబంధనల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. శుక్రవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాలుగవ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్టగా పోస్టింగులు ట్రోల్ చేయడం రాతియుగంలో కూడా లేని హీనత్వాన్ని తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు చెందిన మహిళలపై అసభ్యకరమైన పదజాలంతో పాటు అశ్లీల చిత్రాలు, అక్రమ సంబంధాల వంటి కట్టు కథల పోస్టింగులు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం ఎంతో జుగుప్సాకరమైన విషయమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్నటు ఒక మహిళ రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారి కుటుంబ మహిళలపై సోషల్ మీడియాలో ఎంతో బాధాకరమైన పోస్టులు పెట్టడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు.

అయితే అటు వంటి వారిని ప్రతి పక్షాల వారు సమర్థించడం సరికాదన్నారు. ఇటువంటి సందేశాలు ఇవ్వడం ద్వారా వారు సమాజానికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాసిరెడ్డి పద్మ అన్నారు. సోషల్ మీడియా సమాజంలో సృష్టించే దారుణాతి దారుణమైన పరిస్థితులను నియంత్రించడంలో న్యాయ, పోలీస్ వ్యవస్థలు కూడా ఏమీ చేయలేని పరిస్థితులో ఉండటం వల్ల సమస్య మరింత జఠిలం అవ్వడానికి దారి తీస్తున్నదన్నారు. సోషల్ మీడియా దాడిని యాసిడ్ దాడులు, హత్యాయత్నాలతో సమానంగా చూడాల్సిన అవసరం ఉందని వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. వ్యక్తిత్వ హననం హత్య కంటే దారుణంగా మారినప్పుడు చట్టాలకు పదును పెట్టి అదుపుతప్పున సోషల్ మీడియాను కట్టడి చేయాల్సిన అవసం ఎంతో ఉందని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సంస్కరణలు తీసుకురావల్సిన ఆవశ్యకతపై పలువురి సూచనలు, సలహాలను స్వీకరించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో జూలై 5న విజయవాడలో ఒక సెమినార్‌ను నిర్వహించనున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed