ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్: దసరాకు 5,500 స్పెషల్ బస్సులు.. నామమాత్రపు ధరలతోనే

by Seetharam |   ( Updated:2023-10-04 09:25:25.0  )
ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్: దసరాకు 5,500 స్పెషల్ బస్సులు.. నామమాత్రపు ధరలతోనే
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల ప్రజలు దసరా పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, బంధుమిత్రలుతో కలిసి ఇంటిల్లపాది ఈ దసరా వేడుకలను జరుపుకుంటారు. మరోవైపు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతుంటారు. ఇందులో భాగంగా దసరా శరన్నవరాత్రి వేడుకల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు ముఖ్యంగా ఏపీ వాసులు సొంత ప్రాంతానికి తరలివస్తుంటారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి గతంలో ప్రయాణం భారంగా మారేది. బస్సులు దొరక్క ఇబ్బందులు పడేవారు. అలాంటి వాటికి ఏపీఎస్ఆర్టీసీ చెక్ పెట్టేసింది.ఈ దసరాకు 5,500 ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఈనెల 13 నుండి 26 వరకు ఏపీ,తెలంగాణ, కర్ణాట రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను తిప్పాలని నిర్ణయించింది. అది కూడా సాధారణ చార్జీలతోనే కావడం గమనార్హం. ప్రయాణికులపై భారం మోపకూడదనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ సారి కూడా సాధారణ ఛార్జీలతోనే ఈ ప్రత్యేక బస్సులు నడపబడతాయని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. తెలంగాణ, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి అంతరాష్ట్ర నగరాల నుండి వచ్చే ప్రయాణికులకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అలాగే విజయవాడ నుండి రాష్ట్రంలోని అన్నిఇతర ప్రాంతాలకు తిరిగే బస్సులను యధావిధిగా నడపడంతో పాటు, వివిధ జిల్లాలకు, ముఖ్య పట్టణాలకు, నగరాలకు కూడా ఇబ్బంది లేకుండా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణీకుల అవసరం మేరకు బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఎక్కడి నుంచి ఎక్కడకు? ఎన్నెన్ని బస్సులు?

హైదరాబాద్ నుండి 2,050 బస్సులు, బెంగుళూరు నుండి 440 బస్సులు, చెన్నై నుండి 153 బస్సులు వివిధ పట్టణాలకు నడపబడతాయి. విశాఖపట్నం నుండి 480 బస్సులు, రాజమండ్రి నుండి 355 బస్సులు, విజయవాడ నుండి 885 బస్సులు, అదే విధంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు/ పల్లెలకు/ నగరాలకు 1,137 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాటు చేయబడ్డాయి. దసరా పండుగ రోజులలో అదనంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి పొరుగు రాష్ట్రాలకు, రాష్ట్రంలోని మఖ్యపట్టణాలు, నగరాలకు, ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేసింది ఏపీఎస్ఆర్టీసీ. విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, బెంగుళురు, చెన్నై, తిరుపతి, అనంతపురం, విజయనగరం, కాకినాడ, భీమవరం, అమలాపురం, కడప, భద్రాచలం, శ్రీశైలం, మార్కాపురం, ఒంగోలు, తుని, శ్రీకాకుళం, నెల్లూరులకు ఈ 5,500 ప్రత్యేక బస్సులు నడపబడతాయి. 13 నుండి 23 వరకు (దసరా ముందు రోజులలో) 2,700 బస్సులు, 23 నుండి 26 వరకు ( దసరా తర్వాత రోజులలో ) 2,800 బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికులకు చిల్లర సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు యు టి ఎస్ మెషీన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.

ముందస్తు రిజర్వేషన్లతో 10శాతం రాయితీ

ప్రయాణికుల సౌకర్యార్ధం ఈ స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఇప్పటికే కల్పించబడింది. రాను పోను అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఛార్జి లో 10% రాయితీ సౌకర్యం కల్పించింది. ఏటీబీ ఏజెంట్లు, ఆర్టీసీ యాప్, ఆన్ లైన్ లలో ద్వారా కూడా టిక్కెట్లు పొందవచ్చు అని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ సర్వీసుల పర్యవేక్షణకై జిల్లా ముఖ్య కేంద్రాలు, హైదరాబాద్‌లలో పలు పాయింట్ల వద్ద అధికారులు, సూపర్ వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. అన్ని బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్, 24x7 సమాచారం/ సమస్యలకై కాల్ సెంటర్ నెంబర్ 149 మరియు 0866-2570005 అందుబాటులో ఉంటాయి అని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed