- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుడ్ న్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వాయిదా పడిందా? ప్రస్తుతానికి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? ఇది ఎన్నికల ఎత్తుగడనా? లేక రాజకీయ పార్టీ ల ఒత్తిడినా? స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రభావమా? లేకపోతే న్యాయస్థానాల్లో విచారణ ఎదుర్కోలేక? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నినాదంతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కుదిపేస్తోంది. విశాఖకు మణిహారంగా ఉన్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. అయినప్పటికీ కేంద్రం వెనకడుగు వేయలేదు. ప్రైవేటీకరణ విషయంలో దూకుడు పెంచింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు.
నిలిచిపోయినట్లేనా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పడిప్పుడే జరగదని ఎంపీ జీవీఎల్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచన చేస్తోందని, యథాతథ స్థితిని కొనసాగించేలా కేంద్రం నుంచి సంకేతాలు వచ్చాయని వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకం దాదాపు నిలిచిపోయినట్టేనని...అయితే సంస్థను లాభాల బాటలో నడిపించాల్సి ఉందని సూచించారు. అప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుందని ఎంపీ జీవీఎల్ అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను లాభసాటిగా నడిపించే బాధ్యత ఉద్యోగులదేనని చెప్పుకొచ్చారు. లాభసాటిగా ఉక్కుకర్మాగారం నడుస్తున్నప్పుడు తానే ప్రధాని మోడీని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఒప్పించే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ 30 వేల మంది ఉద్యోగులది మాత్రమే కాదు అని ప్రజల ఆస్తి అని ఎంపీ జీవీఎల్ చెప్పుకొచ్చారు. యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని ఎంపీ జీవీఎల్ తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన గనుల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎంపీ జీవీఎల్ ప్రకటించారు.
ఎన్నికల స్టంట్?
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంతోమంది పోరాటం చేశారు. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేశాయి. ఉక్కు కార్మిక సంఘాలు అయితే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంతలా పోరాటం చేసినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. అలాంటి కేంద్రం ఉన్నట్లుండి వెనక్కి తగ్గడం వెనుక ఎన్నికల స్టంట్ ఏదైనా ఉందనే ప్రచారం జరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే ఏపీకి అనుకూలంగా కేంద్రం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఆర్దికంగా ప్రభుత్వ వినతుల పై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది. అలాగే విశాఖను నీతి అయోగ్ గ్రోత్ హబ్ సిటీ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రానికి ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలను సైతం కేటాయించింది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వెనక్కి తగ్గింది. ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే బీజేపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయిందని అందులో భాగంగానే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందని తెలుస్తోంది.