కొత్తగా ఓటు వేస్తున్నారా.. ఇలా చేస్తే క్యూలైన్‌ను ఫోన్‌లో చూడొచ్చు..!

by srinivas |
కొత్తగా ఓటు వేస్తున్నారా.. ఇలా చేస్తే క్యూలైన్‌ను ఫోన్‌లో చూడొచ్చు..!
X

దిశ, సిటీబ్యూరో: ఈ నెల 13న జరగాల్సిన పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. శుక్రవారం బేగంపేట హరిత ప్లాజా హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటంతో పాటు ఈసారి బయట కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 12న ఉదయం 10 గంటల నుంచి డీఆర్సీ సెంటర్లలో ఎలక్షన్ మెటీరియల్ బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్‌లను ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఏర్పాటు చేసిన డీఆర్సీ సెంటర్లలో ఎలక్షన్ మెటీరియల్‌ను పోలింగ్ బూత్‌ల వారీగా అందజేయనున్నట్లు తెలిపారు. ఒక్కసారి ఎలక్షన్ మెటీరియల్‌ను తీసుకున్న తర్వాత సంబంధింత ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు పోలింగ్ ముగిసి, మళ్లీ ఎలక్షన్ మెటీరియల్‌ను డీఆర్సీ సెంటర్లలోని స్ట్రాంగ్ రూమ్‌లలోకి వెళ్లిన తర్వాతే జిల్లా ఎన్నికల అధికారి సమకూర్చిన వాహనాల్లో తమ ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుందని వివరించారు.


మొరాయిస్తే సమాచారమివ్వాలి..

ఎక్కడైనా ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్‌లు మొరాయిస్తే ఆర్ఓ, ఏఆర్ఓలు వెంటనే సంబంధిత సెక్టార్ ఆఫీసర్లకు సమాచారమివ్వాలని సూచించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందులో భాగంగానే 85 ప్లస్ వయస్సున వారి కోసం హోమ్ ఓటింగ్ అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. దీనికి తోడు కొత్తగా ఓటు వేసే వారితో పాటు పాత ఓటర్లు తమ ఓటు ఉన్న పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ల క్యూను తమ ఫోన్లలోనే చూసుకునేందుకు వీలుగా జీహెచ్ఎంసీ వెబ్ సైట్‌లో పోల్ క్యూ రూట్ లింకును అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లకు ఈ లింకు అందుబాటులో ఉందన్నారు. పోలింగ్ కోసం 367 సెక్టార్ ఆఫీసర్లను నియమించినట్లు, వీరు ప్రతి రెండు గంటల కోసారి పోలింగ్ సరళిపై జిల్లా ఎన్నికల అధికారికి నివేదికలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పోలింగ్ రోజున ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్‌కు, ఓటు వేసిన తర్వాత మళ్లీ ఇంటికి ఫ్రీ డ్రాపింగ్ కోసం 311 మంది ఓటర్లు సాక్ష్యం యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

సెల్‌ఫోన్‌తో ఓటేసేందుకు వస్తే..

కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ స్టేషన్‌లోకి సెల్ ఫోన్ అనుమతించేది లేదు. కానీ కొందరు ఓటర్లు పొరపాటున, మర్చిపోయి సెల్ ఫోన్‌తో పోలింగ్ స్టేషన్‌కు వస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఏర్పాటు చేయనున్న ఓటరు అసిస్టెన్స్ సెంటర్‌లో అందుబాటులో ఉండే బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్ఓ) వద్ద సెల్ ఫోన్ ఉంచి, ఓటు వేసుకున్న తర్వాత తిరిగి మీ సెల్ ఫోన్ తీసుకునే వెళ్లవచ్చునని డీఈఓ తెలిపారు. చిన్న పిల్లలను పోలింగ్ బూత్‌లోకి అనుమతించేది లేదన్నారు. ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వారు సైతం తమ ఐడీ కార్డును చూపించి పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లాలన్నారు.

అందుబాటులో 45 మంది ఈసీఐఎల్ ఇంజినీర్లు

పోలింగ్ రోజున ఎక్కడైనా ఈవీఎంలు మొరాయించినా, వెంటనే వాటిని సరిచేయటమో, వాటి స్థానంలో వేరే ఈవీఎంలను కనెక్ట్ చేసేందుకు వీలుగా 45 మంది ఈసీఐఎల్ ఇంజినీర్లు అందుబాటులో ఉండనున్నట్లు డీఈఓ తెలిపారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు ముగ్గురు చొప్పున కేటాయించినట్లు ఆయన తెలిపారు.

పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్‌లకు స్పందన

ఎలక్షన్ డ్యూటీలు చేస్తున్న వివిధ శాఖల సిబ్బందికి ఇప్పటి వరకు నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్‌కు మంచి స్పందన వచ్చిందని, 14 వేల 292 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నారని, గతంతో పోలిస్తే 6 వేల మంది అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రంతో పోస్టల్ బ్యాలెట్ ముగుస్తుందన్నారు. హోమ్ ఓటింగ్ కూడా పర్ఫెక్ట్‌గా జరిగిందన్నారు. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో 18 వేల 259 మంది పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోగా, వీరిలో13 వేల 581 మంది ఓటింగ్ చేసినట్లు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భాగంగా 874 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగిస్తుండగా, ఇప్పటి వరకు 711 మంది ఓటింగ్ వేశారన్నారు. అలాగే 85 ప్లస్ వయస్సున వారి కోసం హోమ్ ఓటింగ్ ఆప్షన్ పెట్టగా, హైదరాబాద్ జిల్లాలో 500 మంది దరఖాస్తు చేసుకోగా, 481 మంది ఓటింగ్ చేసినట్లు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ పరిధిలో 57 మంది దరఖాస్తు పెట్టుకోగా, 55 మంది ఓటింగ్ చేసినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed