ఏపీలో సినిమా పాలిటిక్స్: వ్యూహంకు ప్రతివ్యూహం ఉంటుందన్న లోకేశ్

by Seetharam |
ఏపీలో సినిమా పాలిటిక్స్: వ్యూహంకు ప్రతివ్యూహం ఉంటుందన్న లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ రాజకీయం ఇప్పుడు సినిమాల కేంద్రంగా తిరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆర్జీవీ సినిమాలు తీయడం తెలిసిందే. గతంలో కూడా వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే పంథాను ఎన్నుకున్నారు ఆర్జీవీ. సీఎం వైఎస్ జగన్ జీవిత చరిత్ర ఆధారంగా వ్యూహం సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టు సినిమా విడుదలను వాయిదా వేసింది. అయితే తాను వైసీపీకి వ్యతిరేకంగా.. టీడీపీకి అనుబంధంగా సినిమా తీస్తానని అంటున్నారు సినీ నిర్మాత నట్టి కుమార్. ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు ఏపీలో రియల్ రాజకీయం రీల్స్‌లో చూపించబోతున్నారనే చర్చ మెుదలైంది. ఇలాంటి తరుణంలో నారా లోకేశ్ సైతం వ్యూహంకు ప్రతివ్యూహం ఉండదా అని లోకేశ్ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. నారా లోకేశ్ కూడా వైసీపీకి వ్యతిరేకంగా సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారా? అనే చర్చ జరుగుతుంది.

రీల్స్‌లో పాలిటిక్స్

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అభ్యర్థుల ఎంపిక, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి అనే అంశాలపై రాజకీయ పార్టీలు వ్యూహరచన చేస్తుంటాయి. అయితే ఏపీలో అందుకు భిన్నంగా జరుగుతుంది. ఏపీలో రియల్ పాలిటిక్స్‌ను రీల్స్‌లో చూపించేందుకు రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యూహం, శపథం సినిమాలు తీస్తుంది. ఈ సినిమాలను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తుంటే నిర్మాతగా దాసరి కిరణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. రెండు పార్టులలో ఒక పార్ట్‌గా వ్యూహం సినిమా విడుదలైంది. ఈ వ్యూహం సినిమా విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ సినిమా విడుదలను ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు సినిమా విడుదలను వాయిదా వేసింది. దీంతో ఈనెల 29న విడుదల కావాల్సిన సినిమా మరింత ఆలస్యం అయ్యింది.

వ్యూహం బడ్జెట్ సైకో జగన్‌దే

ఇదిలా ఉంటే వ్యూహం సినిమాపై నారా లోకేశ్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలపై బురద చల్లడం,సినిమాలు తీయడం కొందరికి అలవాటుగా మారింది అని అన్నారు. వ్యూహం సినిమా బడ్జెట్ అంతా సైకో జగన్ దేనని ఆరోపించారు. ఇప్పటికే ఆ సినిమా డైరెక్టర్ రెండుమూడుసార్లు జగన్ ను కలిశారు. రాంగోపాల్ వర్మ తరపున న్యాయపోరాటం చేస్తున్న లాయర్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు. ఆయన తెలంగాణా హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నాడంటే అర్థం ఏమిటి? దీని వెనుక ప్రభుత్వం ఉంది. సినిమా తీయాలంటే హు కిల్డ్ బాబాయ్, కోడికత్తి, ప్యాలెస్ కుట్రలపై తీయవచ్చు. లేనిది ఉన్నట్టు చూపితే మేం పోరాడతాం. మాకు ఉన్న హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టులపై ఉంది. స్టేట్, సెంట్రల్ సెన్సార్ బోర్డులకు లేఖలు రాశాం పట్టించుకోలేదు, అందుకే కోర్టుకెళ్లాం, న్యాయస్థానంలో వచ్చే తీర్పును బట్టి ముందుకు వెళ్తాం’ అంటూ నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సినిమా తీస్తానన్న నట్టి కుమార్

ఇదిలా ఉంటే నారా లోకేశ్ వ్యూహం మూవీకి ప్రతి వ్యూహం సైతం తమకు ఉందంటూ నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా తీయడం వాళ్లకే వచ్చా అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీకి వ్యతిరేకంగా నారా లోకేశ్ సినిమా తీయించేందుకు రెడీ అవుతున్నారా ఏంటనే అంశంపై చర్చ జరుగుతుంది. రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాను తాను కూడా చూస్తానని..అనంతరం వైసీపీకి వ్యతిరేకంగా తాను కూడా సినిమా తీస్తానని ఇప్పటికే నట్టికుమార్ ప్రకటించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు కస్టడీలో చిత్రహింసలకు గురి చేయడం, వైసీపీ పాలనలో అరాచకాలను ఆ సినిమాలో చూపిస్తానని నిర్మాత నట్టి కుమార్ అన్నారు. ఇప్పటికే నట్టి కుమార్ సినిమా తీస్తానని ప్రకటించిన నేపథ్యంలో మాకు వ్యూహంకు ప్రతి వ్యూహం తీయడం వచ్చు అంటూ లోకేశ్ వ్యాఖ్యలు చేయడంతో సినిమా తీస్తారా? అనే సందేహం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed