Vemagiri: రేపే టీడీపీ మహానాడు.. చంద్రబాబు ప్రసంగంపైనే అందరి దృష్టి

by srinivas |   ( Updated:2023-05-26 15:08:08.0  )
Vemagiri: రేపే టీడీపీ మహానాడు.. చంద్రబాబు ప్రసంగంపైనే అందరి దృష్టి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి వేదికగా శని, ఆదివారం టీడీపీ మహానాడు జరగబోతోంది. సుమారు 38 ఎకరాల్లో మహానాడు ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. వేదికపై 320 మంది టీడీపీ నేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శతజయంతి ముగింపు ఉత్సవం ఈ వేడుకల్లో జరగనుంది. దీంతో ఈ మహానాడు వేదికకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మహానాడు నిర్వహణతో గోదావరి జిల్లాలో టీడీపీ బలోపేతం అవ్వడంతోపాటు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అత్యధిక సీట్లలో గెలుపొందడం ఖాయమని టీడీపీ భావిస్తోంది. అంతేకాదు ఎన్నికల సంవత్సరంలో జరిగే ఈ మహనాడులో టీడీపీ మొదటి మేనిఫేస్టోను ఇదే వేదికపై నుంచి సూచన ప్రాయంగా ప్రకటించనుంది. అటు మహానాడు ఇటు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల ముగింపు ఉత్సవం తిలకిచేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివస్తారని టీడీపీ భావిస్తోంది. మహానాడు సందర్భంగా ఇప్పటికే రాజమహేంద్రవరం పసుపుమయమైంది. రాజమహేంద్రవరం సిటీ అంతా టీడీపీ తోరణాలతో కళకళలాడిపోతోంది.

బలనిరూపణకు వేదిక

ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా అందులో ఉభయగోదావరి జిల్లాల పాత్ర అత్యంత కీలకం. ఈ రెండు జిల్లాలలో ఏ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందితే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఇదే సెంటిమెంట్‌ను అన్ని రాజకీయ పార్టీలు నమ్ముతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అదే ఉభయగోదావరి జిల్లాలో టీడీపీ మహానాడును నిర్వహిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కూడా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ గోదావరి జిల్లాల సాక్షిగా తమ బలాన్ని తెలియజేయాలని భావిస్తోంది. ఎన్నికల ముందు బలం చాటుకొనేలా బహిరంగ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి 15 లక్షల మందిని సమీకరించాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహానాడుకు హాజరవ్వాలంటూ చంద్రబాబు సంతకాలతో ఆహ్వాన పత్రాలను సైతం పంపిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ మహానాడు ద్వారా పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమర శంఖం పూరించనున్నారు.

చంద్రబాబు ప్రసంగంపై ఉత్కంఠ

2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో గెలుపొందాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అవసరమైతే ఏ పార్టీతోనైనా కలిసి ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన,బీజేపీ కలిసి పోటీ చేయాలని అటు చంద్రబాబు నాయుడు ఇటు జనసేనాని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అయితే టీడీపీతో పొత్తుకు బీజేపీ అంగీకారం తెలపడం లేదు. బీజేపీ ఒప్పుకోకపోయినా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇందులో ఎలాంటి సందేహం లేదని రాజకీయంగా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో మహానాడు జరుగుతుంది. దీంతో మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు పొత్తులపై క్లారిటీ ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు వచ్చే ఎన్నికలకు సంబంధించి దశ, దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. అలాగే ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి సూచన ప్రాయంగా కీలక ప్రకటనలు చేస్తారని తెలుస్తోంది. అలాగే యువతలో ఉత్సాహం నింపేందుకు సీట్ల కేటాయింపులపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మరోవైపు శుక్రవారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మహానాడులో ప్రవేశ పెట్టే తీర్మానాలను చర్చించి ఆమోదించనున్నారు. మొత్తం 20 తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అందులో ఏపీకి సంబంధించి 14, తెలంగాణకు సంబంధించి 6 తీర్మాణాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఏర్పాట్లు అదరహో

తూర్పుగోదావరి జిల్లాలో మహానాడు నిర్వహించడం కొత్తేమీ కాదు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో 2006లో మహానాడు నిర్వహించారు. ఆ మహానాడు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 38 ఎకరాల విశాలమైన గ్రౌండ్‌లో ఆదివారం మహానాడు సభ జరగనుంది. ఈ మహాసభకు 10 నుంచి 15 లక్షల మంది హాజరవుతారని టీడీపీ అంచనా వేస్తోంది. అలాగే శనివారం టీడీపీ ప్రతినిధులు సభ జరగనుంది. ఈ సభకు సుమారు 15 వేల మంది హాజరుకానున్నారు. హైదరాబాద్‌కు చెందిన కేకే ఈవెంట్ సంస్థ అత్యాధునిక టెక్నాలజీతో టెంట్లు ఏర్పాటు చేశారు. వర్షాన్ని, ఎండలను తట్టుకునే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేకాదు రక్తదానం శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్,ప్రెస్ గ్యాలరీ, భోజన హాల్స్‌లను సైతం అద్భుతంగా తీర్చిదిద్దారు. గోదావరి రుచులను, ఆతిథ్యాన్ని ఈ మహానాడులో రుచి చూపించనున్నారు. తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తలకు మహానాడు అంటే పండుగ వాతావరణం. దీంతో ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పార్టీ అభిమానులు కార్యకర్తలు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంతోపాటు పరిసర ప్రాంతాల్లోని హోటల్స్, కళ్యాణ్ మండపాలు, గెస్ట్ హౌస్ లో అన్నీ పది రోజులు క్రితమే బుక్ అయిపోయాయి. మహానాడు సందర్భంగా రాజమహేంద్రవరం నగరం అంతా పసుపు మయంగా మారింది. జాతీయ రహదారి పొడవునా భారీ కటౌట్లు వెలిశాయి. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు రహదారి పొడవునా టీడీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.

మూడు రోజులపాటు చంద్రబాబు, లోకేశ్ మకాం

మహానాడు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు ఆయన రాజమహేంద్రవరంలో బస్సులోనే బస చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం వేమగిరి బయలుదేరనున్న చంద్రబాబు నాయుడు అక్కడ జరిగే టీడీపీ పొలిట్ ‌బ్యూరో సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి వేమగిరిలో బస్సులో బస చేస్తారు. అనంతరం రేపు, ఎల్లుండి మహానాడులో పాల్గొంటారు.మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం శుక్రవారం సాయంత్రం మహానాడు ప్రాంగణానికి చేరుకుంటారు. నాలుగు రోజులపాటు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేశ్ ఈ మహానాడులో కీలకంగా మారబోతున్నారు. యువగళం పాదయాత్రలో లోకేశ్ దృష్టికి వచ్చిన కీలక అంశాలపై ప్రస్తావించనున్నారు. లోకేశ్ సైతం మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బస్సులోనే బస చేయనున్నారు.

ఇవి కూడా చదవండి: టీడీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి

Advertisement

Next Story

Most Viewed