Ap News: వైసీపీలోకి ముద్రగడ.. ఎంపీ మిథున్ రెడ్డి ఏమన్నారంటే..!

by srinivas |   ( Updated:2023-07-09 10:27:29.0  )
Ap News: వైసీపీలోకి ముద్రగడ.. ఎంపీ మిథున్ రెడ్డి ఏమన్నారంటే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతామంటే తాము స్వాగతిస్తామని ఉభయగోదావరి జిల్లాల కో ఆర్డినేటర్, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు పార్టీలో చేరితే పార్టీ బలోపేతం అవుతుందని ఆయన చెప్పారు. అయితే ముద్రగడ పార్టీలో చేరే విషయమై సీఎం జగన్ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాకినాడలో ఉభయగోదావరి జిల్లాల కో ఆర్డినేటర్,ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తాము లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌తోనే ఎన్నికలకు వెళ్తామని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదన్నారు. ఐదేళ్లు పాలించాలని ప్రజలు తమకు అధికారాన్ని అప్పగించారని..అందువల్ల వచ్చే ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయని టీడీపీ, జనసేన చేస్తున్న ప్రచారాన్ని మిథున్ రెడ్డి ఖండించారు. ఆయా పార్టీల క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు ముందస్తు ఎన్నికల అంశాన్ని టీడీపీ, జనసేన పార్టీలు తెరపైకి తెస్తున్నారని మిథున్ రెడ్డి తెలిపారు.

పవన్ నిర్ణయిస్తే సరిపోదు

రాష్ట్రంలో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు క్లారిటీ లేదని ఉభయగోదావరి జిల్లాల కో ఆర్డినేటర్, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు నాయుడుని సీఎం చేసేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడని ఆయన చెప్పారు. కాపు ఎమ్మెల్యేలను తిడితే వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేశారని ఆరోపించారు. అభిమానులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్దిపొందాలని పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని కాకుండా అడ్డుకుంటామని, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేస్తామని పవన్ కల్యాణ్ అన్న వ్యాఖ్యలపై ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. సీఎం ఎవరు కావాలో, ఎవరు వద్దో ప్రజలు నిర్ణయిస్తారని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణో, మరొకరో నిర్ణయిస్తే అది జరగదని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed