Ap News: ధాన్యం కొనే వాళ్లు ఏరి..!

by srinivas |   ( Updated:2022-12-19 15:17:04.0  )
Ap News: ధాన్యం కొనే వాళ్లు ఏరి..!
X
  • మొన్నటి దాకా తుపాను భయం
  • తాజాగా కొనేవారు లేని వైనం
  • ఆరుదల ఎంత ఉన్నా ఫలితం శూన్యం
  • గోనె సంచులు లేక ఇబ్బందులు
  • ఆర్బీకేల చుట్టూ రైతులు ప్రదక్షిణలు
  • ప్రారంభమైన దాళ్వా పంట పనులు
  • పెట్టుబడులకు కాసులు లేక ఇక్కట్లు

దిశ (ఉభయ గోదావరి): గోదావరి జిల్లాల్లో ధాన్యాన్ని కొనే వాళ్లు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మొన్నటి దాకా మాండూస్ తుపాను ప్రభావంతో ధాన్యం తడిసి పోయింది. తర్వాత చినుకులు ప్రారంభమై పూర్తిగా రంగు మారింది. ఇటీవల ఎండలు కాస్తున్న సమయంలో ధాన్యం కాస్త ఆరుబెట్టుకొంటున్నారు. అయితే ఆరుదల ఎంత ఉన్నా ధాన్యాన్ని కొనే నాదుడు లేడు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆర్బీకేల వద్దకు వెళ్లి తమ ధాన్యం కొనండి బాబూ అంటూ రైతులు బ్రతిమాలుడుతున్నారు. అయినా ఫలితం శూన్యం. గోనె సంచులు లేవని వంకలు పెడుతున్నారు. దీంతో కొనే నాదుడు లేక రైతుల అల్లాడిపోతున్నారు. ధాన్యాన్ని కల్లాల్లోనే నిల్వ ఉంచి ఎవరు కొంటారా అంటూ నిరీక్షిస్తున్నారు. దీనికి తోడు గోదావరి జిల్లాల్లో దాళ్వా పంట పనులు ప్రారంభమయ్యాయి. అయితే రైతులు వద్ద పెట్టుబడులకు సొమ్మలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. తొలకరి పంట తాలూకు ధాన్యం కొని సొమ్ములు ఖాతాల్లో వేసి ఉంటే అట్టే సమస్య ఉండేది కాదని అంటున్నారు. ఓ పక్కన తొలకరి ధాన్యాన్ని నిల్వ ఉంచుకోలేక, మరో ప్రక్కన దాళ్వా పంటకు పెట్టుబడులు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు.

మాసూళ్లు పూర్తి అయ్యాయి. కానీ ధాన్యం కొనే వాళ్లు లేరు

గోదావరి జిల్లాల్లో తొలకరి మాసూళ్లు పూర్తి అయ్యాయి. రైతులు ధాన్యాన్ని కల్లాల్లో నిల్వ ఉంచారు. అయితే కొనే నాధుడు లేక ఆర్తనాదాలు పెడుతున్నారు. పంట మాసూళ్ల ఆరంభంలో ధాన్యం కొద్దిగా కొనుగోలు ప్రారంభించి పెద్ద ఎత్తున కొంటామని బిల్డప్ ఇచ్చారు. దీంతో రైతులు నమ్మారు. త్వరిత గతిన ధాన్యాన్ని మాసూళ్లు చేశారు. ఆర్బీకేల వద్దకు వెళ్లి ధాన్యాన్ని కొనమని అడగడం ప్రారంభించారు. కానీ అధికారులు ముందుకు రావడం లేదు. అంతేగాక ఆదిలో కొన్న ధాన్యానికి సొమ్ములు కూడా వేయడం లేదు. ధాన్యం ఎందుకు కొనడం లేదని అడిగితే సంచులు లేవని, సమాధానం ఇస్తున్నారు. దీంతో అన్నదాతలు డీలా పడిపోతున్నారు. ఏటా షరా మామూలేనా అంటున్నారు. గోదావరి జిల్లాల్లో్ దాదాపుగా 8 లక్షల ఎకరాల్లో మాసూళ్లు పూర్తి చేసుకొని రైతులు ధాన్యం అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ధాన్యాన్ని కల్లాల్లో నిల్వ ఉంచారు. చాలా చోట్ల రైతులకు నిల్వ ఉంచుకొనే సదుపాయం లేక ఆరుబయట రోడ్ల మీద నిల్వ ఉంచుకొంటున్నారు. దీంతో రైతులు చాలా అవస్థల పాలవుతున్నారు. కనీసం ఇప్పటి దాకా పది శాతం ధాన్యాన్ని కూడా అధికారులు కొనలేకపోయారు.

దాళ్వా పంటకు పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకుని రావాలి

వాస్తవానికి తొలకరి పంట ధాన్యం విక్రయిస్తే ఆయా సొమ్ములతో దాళ్వా పంటకు పెట్టుబడులు పెట్టడం ఆనవాయితీ. తొలకరి పంట ద్వారా వచ్చిన సొమ్ముల్లో మగతాలు, పంట రుణాలు పోగా, మిగతా సొమ్ములతో దాళ్వాకు పెట్టుబడులు పెడతారు. కానీ తొలకరి పంట సొమ్ములు అందక పోవడం వల్ల రైతుల చేతిలో చిల్లి గవ్వ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడుల కోసం ప్రైవేటు అప్పులను ఆశ్రయిస్తున్నారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో రైతులు ఆందోళనలో పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed