విధులకు డుమ్మా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో కనిపించని ఉద్యోగులు

by Jakkula Mamatha |
విధులకు డుమ్మా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో కనిపించని ఉద్యోగులు
X

దిశ, పల్నాడు: స్థానికంగా అన్ని రకాల పౌర సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వార్డు గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరు నానాటికి తీసికట్టుగా మారుతోంది. సేవలు అటుంచితే అసలు ఉద్యోగులు విధులకు హాజరు కావడమే గగనంగా కనిపిస్తోంది. సమయపాలన అసలు పాటించడం లేదు. ఉదయం 11 దాటిన తర్వాత గానీ కార్యాలయాలకు రావడం లేదు. మధ్యాహ్నం 1 తర్వాత ఎవరూ ఉండటం లేదు. కొన్నిచోట్ల వారానికి రెండు, మూడు సార్లు కూడా తెరుచుకోవడం లేదు. దీంతో పలు పనుల కోసం వచ్చిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది.

కొరవడిన పర్యవేక్షణ..

ఒక్కో సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓ, ఇంజినీరింగ్, డిజిటల్, వెల్ఫేర్, అగ్రికల్చర్, ఎనర్జీ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎం, సర్వేయర్, మహిళ పోలీసు ఉంటారు. వార్డు గ్రామ సచివాలయాలతో పాటు మండల కేంద్రాల్లోనూ ఒకరిద్దరికి మించి సిబ్బంది కనిపించడం లేదు. హాజరు పట్టికలో సంతకాలు మాత్రం ఉంటున్నాయి. ప్రశ్నిస్తే ఫీల్డ్‌లో ఉన్నారంటూ సమాధానమిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు అన్ని శాఖల సిబ్బంది సచివాలయానికి వచ్చి హాజరు పట్టికలో నమోదు చేసుకోవాలి. ఫీల్డ్‌కు వెళ్లాల్సిన అవసరం వస్తే ఎక్కడికి, ఏ పని నిమిత్తం వెళ్తున్నారో మూమెంట్‌ రిజిస్టర్‌లో రాసి వెళ్లాలి. కొందరు ఉద్యోగులు అవేమి చేయడం లేదు. సచివాలయం స్థాయిలో వీరంతా అడ్మిన్, మండల స్థాయిలో ఎంపీడీవోలు మున్సిపాలిటీలో కమిషనర్ పర్యవేక్షించాలి. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారని స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

సత్తెనపల్లి సచివాలయాలలో ఇలా..

సత్తెనపల్లి 7,13 సచివాలయాలలో మధ్యాహ్నం తరువాత ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారు. వాళ్లు కునికి పాట్లతో నిద్రావస్థలో ఉంటున్నారు. మిగతా ఉద్యోగులు ఫీల్డ్ పేరు చెప్పి సచివాలయానికి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో వివిధ పనుల నిమిత్తం సచివాలయానికి వచ్చినవారు వెనుదిరిగి పోతున్నారు. మధ్యాహ్నం తరువాత ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పని నిమిత్తం వెళ్తే సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. అడిగితే పనిపై బయటకు వెళ్లారని చెబుతున్నారు. మధ్యాహ్నం తర్వాత అందుబాటులో ఉండరు. కొన్నిసార్లు సరిగ్గా స్పందించరు. ఇలాగైతే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని సందర్శకులు ప్రశ్నిస్తున్నారు. గాడి తప్పుతున్న ఉద్యోగుల సమయపాలన పై ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed