Breaking: ఆడవారు, వృద్ధుల పట్ల ఆ విషయంలో దూకుడు వద్దు.. ఎన్నికల కమిషన్

by Indraja |   ( Updated:2024-04-13 07:47:11.0  )
Breaking: ఆడవారు, వృద్ధుల పట్ల ఆ విషయంలో దూకుడు వద్దు.. ఎన్నికల కమిషన్
X

దిశ కొండపి: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాల చెలామణి అరికట్టి శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ల వద్ద 24 గంటలు గట్టి నిఘాతోపాటు చెకింగ్ చెయ్యాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన సరిహద్దు జిల్లాల అధికారులను ఆదేశించారు.

ఈ రోజు ముఖేష్ కుమార్ మీన ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చెక్ పోస్ట్ వద్ద నిరంతర నిఘా, చెక్ చేస్తున్న చర్యల గురించి కొండపి నియోజకవర్గ ఎన్నికల అధికారి తోపాటు పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

చెక్ పోస్ట్ వద్ద నిరంతరం తనిఖీ చెయ్యాలని, భారీ వాహనాలు, ట్యాంకర్‌లు, కంటైనర్‌లపై కూడా దృష్టి పెట్టాలని, బయట ప్రాంతాల నుండి మద్యం, నగదు వంటి వాటి రవాణా చెలామణి అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

చెక్‌పోస్ట్ వద్ద ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం నియమించబడిన సిబ్బంది, అధికారులు వారివారి విధులను సక్రమంగా నిర్వహించాలని వ్యక్తుల వద్ద 50 వెలకు మించి నగదు కలిగిన సందర్భాలలో నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు చేపట్టాలని అదేశించారు.

ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులు, ఎన్నికల విధుల్లో నియమితులైన సిబ్బంది ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు, మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేసేందుకు సహకరించాలని కోరారు. ఆడవారు, వృద్ధుల పట్ల చేకింగ్ పేరుతో దూకుడుగా వ్యవహరించవద్దని హెచ్చరించారు.

ఈ సందర్భంగా చెక్‌పోస్ట్ వద్ద నిత్యం చేపట్టిన చర్యలు, వాహన తనిఖీల గురించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సింగరాయకొండ సీఐ దాచేపల్లి రంగనాథ్, ఎస్సై తుళ్లూరు శ్రీరాములు వివరించారు. కాగా కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి, కావలి ఆర్‌డీఓ సీనా నాయక్, పోలీస్ అధికారులు ఆయనకి స్వాగతం పలికారు. ఆయన వెంట ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ గరుడ్ సుమంత్ సునీల్, ఇతర అధికారులు వచ్చారు.

Advertisement

Next Story