'సీఐడీ కేసులకు భయపడం..ఎదుర్కొంటాం'

by Nagaya |   ( Updated:2023-01-30 10:27:07.0  )
సీఐడీ కేసులకు భయపడం..ఎదుర్కొంటాం
X

దిశ, డైనమిక్ బ్యూరో : సీఐడీ విచారణకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు విజయ్ తండ్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్‌ మీడియాను మిస్యూజ్ చేశారని చింతకాయల విజయ్‌పై సీఐడీ కేసు పెట్టిందని చెప్పుకొచ్చారు. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వకుండా గతంలో సీఐడీ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందని వాపోయారు. కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇవాళ విచారణకు న్యాయవాదితో విజయ్ హాజరైనట్లు తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోంది... దుర్మార్గపు రాజ్యంలో ఇబ్బందులు ఉంటాయి.. ప్రజాస్వామ్యంలో ఎదుర్కోక తప్పదు అని చెప్పుకొచ్చారు. విచారణ ముగిసిన తర్వాత అన్ని విషయాలు చెప్తానని చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.

మరోవైపు అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని అణగదొక్కాలనే అనేక రకమైన కేసులు పెట్టి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలను అణగదొక్కాలని చూస్తుందని ఆరోపించారు. బీసీలంతా చంద్రబాబుకు అండగా ఉంటారని కుట్రలు పన్నుతున్నారని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. బీసీలంతా చంద్రబాబు నాయకత్వంలో పనిచేసి జగన్‌ను పారద్రోలే దాకా పనిచేస్తామని చెప్పుకొచ్చారు. సీఐడీ కేసులకు భయపడేది లేదు.. ధీటుగా ఎదుర్కొంటాం అని చెప్పుకొచ్చారు. కేసులు పెట్టి భయపెడదాం అనుకుంటే దేనికైనా రెడీ అని సవాల్ చేశారు. చింతకాయల విజయ్‌ మహిళలపై సోషల్‌ మీడియాలో ఎటువంటి అసభ్యకరమైనవి పెట్టలేదు.. అదంతా ఫేక్ అని స్పష్టం చేశారు. జగన్ విధానాలను ఎండగడతాం తప్ప, మహిళల గురించి తప్పుగా మాట్లాడే సంస్కృతి తమది కాదని చెప్పుకొచ్చారు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతాం అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వెల్లడించారు.

READ MORE

ప్రజలంతా గాంధీజీ జీవితాన్ని స్పూర్తిగా తీసుకోవాలి

Advertisement

Next Story