- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలో ముసలం.. సోము వీర్రాజుపై అసమ్మతి సెగలు
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర బీజేపీలో ముసలం మొదలైందా ? పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా పార్టీలో కొందరు కీలక నేతలు లేకుండా సమావేశాలు జరగడం సాధారణం. ఏకంగా పార్టీ అధ్యక్షుడే లేకుండా సమావేశాన్ని ఇటీవల బీజేపీ నేతలు జరిపారు. దీంతో రాష్ట్ర బీజేపీలో అసలేం జరుగుతుందన్న చర్చ రాజకీయాల్లో మొదలైంది. అధ్యక్షుడు సోము వీర్రాజుకు లేకుండానే విజయవాడలో పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. జాతీయ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ జయప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకూమార్‌కు ఆత్మీయ సమావేశం పేరుతో ఈ సభ ఏర్పాటైంది. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, లంకా దినకర్, తురగా నాగభూషణం, జమ్ముల శ్యామ్ కిషోర్, కిలారు దిలిప్, పాతూరి నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, రమేష్ నాయుడు ఎస్‌కే బాజీ శ్రీనివాసరాజు ఇతర ముఖ్యనేతలు దీనికి హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొనకుండా లేకుండా సమావేశం జరగడం సర్వత్రా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చను తెరమీదకు తీసుకు వచ్చింది. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి గైర్హాజరీలో ఇతర నేతలు భేటీ కావడం వెనుక పలు రకాలైన కారణాలు వినవస్తున్నాయి.
సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక దూకుడుగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కొన్ని సార్లు ఆయన మాటలు సోషల్ మీడియాలో ట్రోల్‌కు గురైనా గానీ బీజేపీని జనంలోకి తీసుకువెళ్లిన నేతగా ఆయనకు పేరుంది. ఆ దూకుడు తనమే ఒక్కోసారి ఆయనకు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడుతున్నదని విశ్లేషకులు అంటారు. మిగతా పార్టీ నేతలను పెద్దగా కలుపుకుని వెళ్లడం లేదని, పెద్దగా ప్రాధాన్యత ఉండడంలేదని గుసగుసలైతే ఉన్నాయి. పార్టీ అధిష్టానం ఇంకా రాష్ట్రంలో ఇతర పార్టీలతో ఎలాంటి సంబంధాలపైనా ఒక రూట్ మ్యాప్ ఇవ్వకముందే ఇటు చంద్రబాబుపై, అటు జగన్ పై ఒంటికాలిపై లేస్తారని ఆయన వ్యతిరేకులు పేర్కొంటున్నారు. ఆవేశమే తన లక్షణంగా చెలరేగిపోయే సోము వీర్రాజుతో కాస్త దూరంగానే ఉంటున్న కొంతమంది నాయకులు ఈ విజయవాడ సమావేశం వెనుక ఉన్నారని అంటున్నారు పార్టీలో పరిస్థితులు గమనిస్తున్నవారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయానికి కృషిచేసిన సత్యకుమార్‌ను రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టాలని నేతలు కోరారని వార్తలు వస్తున్నాయి. త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్చే అవకాశం ఉంటుందని సోము వీర్రాజు వ్యతిరేక వర్గం భావిస్తున్నారు. ఈ సమావేశంలో అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నేతలు సత్యకుమార్ ను పొగడ్తలతో ముంచేత్తారని అంటున్నారు.
సోము వీర్రాజుపై ఆవేశ పరుడన్న ముద్ర ఉంది, గతంలో ఇన్ చార్జి గా ఉన్నప్పుడు గోదావరి జిల్లాల నుంచి ఇద్దరు ఎంపీలను ఇచ్చిన ఘనత కూడా ఉంది. దానితో అధిష్టానం సోము వీర్రాజు పై నమ్మకాన్ని ఉంచింది. కానీ పార్టీలోని కొందరు ఆయనతో ఏకీభవించడం లేదని సోము వీర్రాజు సన్నిహితులు అంటున్నారు. ముఖ్యంగా వేరే పార్టీతో సన్నిహితంగా ఉంటూ పొత్తు కుదిరితే ఎమ్మెల్యే టికెట్స్ వస్తాయనే ఆశలో ఉన్నవారు ఆ పార్టీని వ్యతిరేకించే సోము వీర్రాజుపై గుర్రుగా ఉన్నారని, అందుకే కొత్త నాయకత్వాన్ని తెరమీదకు తేవడానికి చూస్తున్నారని వారు అంటున్నారు. అధ్యక్షుడు ప్రజా సమస్యలపై నెల్లూరులో పోరాడుతుంటే హడావిడిగా విజయవాడలో కొందరు మీటింగ్ పెట్టడం అనేది కచ్ఛితంగా అనుమానించాల్సిన విషయమేనని సోము వీర్రాజు వర్గం అంటున్నది.
జనసేనతో పొత్తు విషయంపై ఎంత ఆశక్తిగా ఉంటారో టీడీపీతో కలవడంపై అంత అయిష్టతను చూపిస్తారు సోము వీర్రాజు అంటారు ఆయన సన్నిహితులు. దానికి తగ్గట్టే కొద్దీ రోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు .. ఒక సందర్భంలో.. 'వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం. బీజేపీ - జనసేన కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయి. టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పలేదు' అని పేర్కొన్నారు. కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దీనికి విరుద్ధంగా ఉంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని పదేపదే చెబుతున్నారు. దాని అర్థం బీజేపీ, టీడీపీ సహా అన్ని విపక్షాలూ కలిసి వైసీపీని 2024లో ఎదుర్కోవాలని ఆయన అభిలషిస్తున్నారు. ఇక్కడే సోము వీర్రాజుకు,పార్టీలోని కొందరికీ అభిప్రాయం భేదాలు నెలకొన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఏదిఏమైనా సోము వీర్రాజు కేంద్రంగా బీజేపీలోని అంతర్గత పోరు ఏ మలుపు తిరుగుతోందో చూడాలి.