Deputy CM Pavan kalyan: పంచాయతీరాజ్ సంస్థల్లో.. కారుణ్య నియామకాలపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

by Geesa Chandu |   ( Updated:2024-09-24 15:45:21.0  )
Deputy CM Pavan kalyan: పంచాయతీరాజ్ సంస్థల్లో.. కారుణ్య నియామకాలపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: పంచాయతీరాజ్ సంస్థ(Panchayat Raj Department)లలో పనిచేసే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉద్యోగులు, వాటి పరిధిలో ఉండే ఉపాధ్యాయులు మరణిస్తే.. వారి వారసులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. తన కార్యాలయానికి కారుణ్య నియామకాలపై పలు అర్జీలు వస్తున్న దృష్ట్యా.. ఉప ముఖ్యమంత్రి పవన్ ఈ అంశంపై అధికారులతో సమావేశమయ్యారు. ఈ నియామకాల ప్రక్రియలో నెలకొంటున్న జాప్యం, నిబంధనలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరణించిన ఉద్యోగులు పంచాయతీరాజ్ సంస్థల పరిధిలో ఉన్నందున, వారి వారసులకు అదే సంస్థల్లో నియమించాల్సి ఉంటుందని, ఖాళీలు తక్కువ ఉండటంతో కారుణ్య నియామకాలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా.. పంచాయతీ రాజ్ సంస్థలలో కారుణ్య నియామకాల జాబితాలో వేచి చూస్తున్నవారికి, జిల్లా కలెక్టర్ కామన్ పూల్ లో ఉన్న ఖాళీలలో అవకాశం కల్పించే అంశంపై చర్చించారు. ఈ దిశగా నియామకాలు చేసే విషయంపై.. సాధారణ పరిపాలన శాఖతో చర్చించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ దిశానిర్దేశం చేశారు.

Advertisement

Next Story

Most Viewed