- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ మున్సిపాల్టీలో అవినీతి తిష్ట..!
దిశ, కాకినాడ: ఆరునెలలు సహవాసం చేస్తే వారు వీరయ్యారన్నట్టుగా ఉంది ఇక్కడ ఉద్యోగుల తీరు. అవినీతి ఆరోపణలు వస్తున్నా, ఏసీబీ దాడులు జరుగుతున్నా షరా మాములే అయిపోతుంది. ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగుల కదలిక లేదు. రాజకీయం ప్రాబల్యం. లోకల్‌గా బలం కలగలిపి వారి అక్రమాలకు , అవినీతి కార్యక్రమాలకు అడ్డులేకుండా పోయింది. పలానా పనిచేయాలంటే వారు చెప్పింది చదివించుకోవాల్సిందే. లేకపోతే ఇక వారి వెనుక కాళ్లరిగేలా తిరగాల్సిందే. రెవిన్యూలో పన్నుల దగ్గర నుండి టౌన్ ప్లానింగ్‌లో ఇంటి నిర్మాణాలకు ఇచ్చే అనుమతుల వరకూ అడుగడుగునా దందా కొనసాగుతుంది. ఇక ఇంజనీరింగ్ విభాగమైతే అవినీతి అడ్డా అయిపోందన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది. చేయని పనులకు బిల్లులు, సగం చేసిన పనికి చెల్లింపులు ఇలా అవినీతి రాజ్యమేలుతోంది. తాగునీటి సరఫరాలో అక్రమాలు మరీ ఘోరంగా మారాయి. ఇటీవల కొంత మంది రాజకీయ పెత్తందార్ల ముసుగులో మరీ అక్రమాలు పెరిగిపోయాయన్న ఆరోపణలను ఈ మున్సిపాల్టీ ఎదుర్కొంటుంది. పెద్ద తలకాయలను అడ్డంపెట్టుకుని ఏలేస్తున్నా, అడిగే నాథుడు లేడంటే అవినీతి తిష్ట ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతోంది. అక్రమాలకు అడ్డగా..అవినీతికి చిరునామాగా మారిన పిఠాపురం మున్సిపాల్టీపై దిశ అందిస్తున్న ప్రత్యేక కథనం..
పిఠాపురం మున్సిపాల్టీలో జరుగుతన్న కార్యకలపాల మాటేమోగాని అవినీతి కార్యక్రమాల్లో మాత్రం ముందంజలో ఉందనే చెప్పాలి. ఇక్కడ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఎక్కువ ఉందన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఎవరైనా ఇంటినిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే లేని రూల్స్ చెప్పేస్తారు. అన్ని చలానాలు, జరిమానాలు కట్టినా అసలు కథ ఇంకా ఉంటుంది. ఏదొక చిన్న కొరివి పెట్టి నిర్మాణానికి అనుమతి ఆపేస్తున్నారు. ఆ తర్వాత బేరం కుదిరితే అనుమతులొస్తున్నాయి. ఒక్కటి కాదు..రెండు కాదు దాదాపుగా ఇంటి నిర్మాణాలకు అనుమతుల విషయంలో టౌన్ ప్లానింగ్ అక్రమాలకు అడ్డులేకుండా పోయిందన్న ఆరోపణలు పెరిగిపోయాయి. అక్రమ నిర్మాణాలంటూ హెచ్చరికలు, ఆపై బేర సారాలతో టౌన్‌ప్లానింగ్ అంతా ఓ ప్లానింగ్ ప్రకారం అక్రమాలు చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రెవెన్యూ లో కూడా అదే తీరు కనిపిస్తోంది. ఇక్కడ కొత్తగా ఇంటి పన్నుకు దరఖాస్తు చేసుకునే వారు, ఇంటి పన్ను మార్పులు, చేర్పులు, ఖాళీ స్థలాలకు పన్ను విధింపులో సిబ్బంది చేతి వాటం పెరిగిందన్న ఆరోపణలున్నాయి. అలాగే భారీగా ఎస్ఎస్ మెంట్ల రద్దు విషయంలో కూడా భారీ బకాయిదారులను తప్పించేందుకు పెద్ద ఎత్తున నగదు చేతులు మారాయని ఇటీవల కౌన్సిల్‌లో కూడా చర్చించడం చూస్తుంటే రెవిన్యూలో జరుగుతున్న అవినీతి వ్యవహారం మున్సిపాల్టీని కుదిపేస్తోందనే చెప్పాలి.
ఏసీబీ దాడులు..విజిలెన్స్‌కు ఫిర్యాదులు
ఇటీవల ఓ కాంట్రాక్టర్ నుండి రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈ సస్పెన్షన్‌కు గురయ్యాడు. అయితే పెద్ద తలకాయాలున్నాయని, చిన్న చేపలు దొరికాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిందంటే ఇక్కడ జరిగే అవినీతి ఏం రేంజ్‌లో ఉందనేది అర్థమవుతోంది. తాగునీటి సరఫరా విషయంలో ట్రాక్టర్లకు మరామ్మత్తులు, మోటార్ల రిపేర్లు, సామాగ్రి కొనుగోలులో లక్షల రూపాయాలు గోల్‌మాల్ జరుగుతోంది. కానీ ఈ పనులను అత్యవసర విధానంలో ర్యాటిఫై చేయించి, కనీసం కౌన్సిల్‌కు కూడా తెలియకుండా ముందస్తుగా బిల్లులు చెల్లింపులు చేసి, ఆతర్వాత కౌన్సిల్‌లో ర్యాటిఫై అంశాలుగా తీసుకురావడంపై ఇటీవల కౌన్సిల్ సమావేశంలో పెద్ద రచ్చ జరిగింది. మెజార్టీ కౌన్సిలర్ల ముసుగులో కొంత మంది రాజకీయ నేతల అండతో ఉద్యోగులు చెలరేగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఓ కౌన్సిలర్, పట్టణానికి చెందిన మరో వ్యక్తి మున్సిపాల్టీ జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్‌కు, మున్సిపాల్టీలో ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. దీనిపై కొంత మంది ఉద్యోగులను ఉన్నతాధికారులు సమాధానం కోరినట్లు కూడా తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం చక్కబెడుతున్నారు.
అవినీతి మరకలున్నా..ఆయనే దిక్కా..!
పిఠాపురం మున్సిపాల్టీలో టీపీవో పోస్టు ఖాళీ..టీపీఎస్‌లు ఇద్దరున్నారు. ఇందులో ఓ టీపీఎస్ ఇన్‌ఛార్జి టీపీవోగా కొనసాగుతున్నారు. ఆయనొక్కడే చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలైతే పట్టణంలోనే పెద్ద చర్చగా మారాయి. టీపీవో పోస్టు ఖాళీ ఉన్నా ఇక్కడకు ఎవరూ రావడం లేదు. ముఖ్యంగా రాజకీయ నేతల అండదండలతో టపీవో పోస్టును కాపాడుకుంటూ ఎవరూ రాకుండా జాగ్రత్తలు పడుతున్నారన్న విమర్శలున్నాయి. మొత్తం పిఠాపురంలో ఉన్న 15 సచివాలయాలలో ప్లానింగ్ సెక్రటరీలపై ఆయనే అజమాయిషీ. ఎక్కడ నిర్మాణం జరిగినా ఫైల్ అక్కడకే చేరాలి. ఆయనే అనుమతివ్వాలి. ఆయన ఓ ఉద్యోగిగా కాకుండా పొలిటికల్ నేత స్థాయిలో చలామణి అయిపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు చెప్పినవి తప్ప, మిగిలిన వాటిలో ఆయన పంధా వేరుగా ఉందంటే సామాన్యుడు ఏ స్థాయిలో ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడో అర్థమవుతోంది. ఇటీవల కాలంలో టౌన్ ప్లానింగ్‌లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ , ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో వారు ఇక్కడ జరిగిన అక్రమాలపై ఆరాతీసినట్లు సమాచారం. టౌన్‌ప్లానింగ్ విభాగంలో పూర్తి విచారణ జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని బాధితులు చెబుతున్నారు.