ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశం

by sudharani |
ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల - తిరుపతి ఘాట్ రోడ్డులో బుధవారం జరిగిన బస్సు ప్రమాదంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణకు ఆదేశించారు. డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్‌తో రీటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గురువారం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ఇందుకు దారి తీసిన కారణాలు ఏమై ఉండొచ్చు అనే అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

బస్సులో సాంకేతిక ఇబ్బందులేమీ లేవని ఓలెక్ట్రా సంస్థ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు సమాచారం ఇచ్చారని తెలిపారు. అతి వేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని దీనిపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దయ వల్ల బస్సులోని ప్రయాణీకులెవరికీ పెద్ద గాయాలు కాలేదని తెలిపారు. తిరుమలకు వచ్చిన భక్తులను క్షేమంగా తిరుపతికి చేర్చడానికి టీటీడీ అన్ని భద్రతా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరక్కుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే విద్యుత్ బస్సుల డ్రైవర్లకు మరోసారి శిక్షణ ఇప్పించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంట టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, ఆర్టీసీ ఆర్ ఎం చెంగల్ రెడ్డి, ఓలెక్ట్రా విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు

Advertisement

Next Story