అమరావతిలో నిరుపేదల సొంతింటికల సాకారం చేశాం : CM YS Jagan Mohan Reddy

by Seetharam |   ( Updated:2023-07-24 07:50:21.0  )
YS Jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతిలో నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారం చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అమరావతి ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్లు ఇవ్వకూడదని ఎందరో ప్రయత్నించారని అయినప్పటికీ తాము వెనక్కి తగ్గలేదన్నారు.అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఉండకూడదనే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు,ఎల్లోమీడియా, చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా సంఘాలు హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ కేసులు వేసి అడ్డంకులు సృష్టించారని చెప్పుకొచ్చారు. ఈ కేసులన్నింటినీ వైసీపీ ప్రభుత్వం అధిగమించినట్లు సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సోమవారం శంకుస్థాపన చేశారు. కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేశారు. కృష్ణాయపాలెం లేఅవుట్‌లో పైలాన్‌ను ముఖ్య‌మంత్రి ఆవిష్కరించారు. అనంత‌రం వన మహోత్సవంలో భాగంగా ముఖ్య‌మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. అమరావతిలో పేదలకు ఇళ్లు రాకూడదని అనేకమంది కుట్రలు చేశారని సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఇల్లు రాకుండా ఉండేందుకు చంద్రబాబు, గజదొంగల ముఠా దాదాపు 23 కేసులు కోర్టుల్లో వేశారని చెప్పుకొచ్చారు. అన్ని కేసులను ఈ ప్రభుత్వం అధిగమించుకుందని ఈ విజయంతో పేదలు గెలిచారన్నారు. పెత్తందార్లకు,పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని సీఎం జగన్ అన్నారు. ఈ యుద్ధంలో పేదలు గెలుపొందారన్నారు. నేటి నుంచి ఈ అమరావతి మన అందరి అమరావతి అని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ శంకుస్థాపనతో కొందరికే పరిమితమైన ఈ అమరావతి ఇకపై సామాజిక అమరాతి అని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

50,793 మందికి లబ్ధి

అమరావతి పరిసర ప్రాంతాల్లో 50,793 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ లబ్ధిదారుల అందరికీ ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుంది అని స్పష్టం చేశారు. ఈరోజు నుంచి సామాజిక అమరావతిగా రూపుదిద్దుకునేలా అడుగులు వేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. 1400ఎకరాలలో 25 లే అవుట్లను అభివృద్ధి చేసి ఇళ్లస్థలాలు ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను తామే తీసుకుంటాం అని సీఎం జగన్ ప్రకటించారు. ప్లాట్ల సరిహద్దులను కూడా ప్రభుత్వమే చేస్తుందని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే రూ.50కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. సీఆర్డీఏ పరిధిలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.75లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఇళ్లకు సంబంధించి రూ.1370 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు సీఎం వైఎస్ జగన్ సభలో ప్రకటించారు. ఇళ్ల నిర్మాణంలో నీటి సరఫరా కోసం రూ.35 కోట్లు ఖర్చు చేయబోతున్నామని ఇప్పటికే టెండర్లు పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. అలాగే విద్యుత్ కనెక్షన్ కోసం రూ.326 కోట్లు..అప్రోచ్ రోడ్ల కోసం రూ.8 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ లే ఔట్లలోనే అంగన్ వాడీ స్కూల్స్, విద్యాసంస్థలు, పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్, థియేటర్లు రాబోతున్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 30.75లక్షల మంది అక్కచెల్లమ్మలకు పట్టాలు ఇచ్చినట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఒక్కొక్క ఇంటి విలువ రూ.5 నుంచి రూ.15 లక్షల వరకు పలుకుతుంది అని చెప్పుకొచ్చారు. ఈ సీఆర్డీఏ ప్రాంతంలో గజం కనీసం రూ.15వేలు అని... ఇంటి స్థలం విలువే రూ.7.50 లక్షలు అని చెప్పుకొచ్చారు. మరో రూ.2.75 లక్షలు పెట్టి ఇల్లు నిర్మిస్తున్నామని... మౌలిక సదుపాయాల కోసం ఒక్కో ఇంటిపై రూ.లక్ష ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇల్లు పూర్తి చేసి ఇచ్చేసరికి రూ.12 నుంచి 15 లక్షల వరకు ఇల్లు విలువ పలుకుతుంది అని ఈ విలువను అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.

Advertisement

Next Story