ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంది: YS Jagan Mohan Reddy

by Seetharam |   ( Updated:2023-08-01 08:32:24.0  )
YS Jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘విశాఖలో అదానీ డేటా పార్కు, ఐటీ స్పేస్‌కు శంకుస్థాపనలు చేశాం. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అదే రోజు భూమిపూజ చేశాం. ఉత్తరాంధ్ర ప్రాంత రూపురేఖలు మార్చే విధంగా మూలపేటలో పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇవన్నీ రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చబోయే గొప్ప అడుగులు. ఆ కోవలోనే దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద మాల్‌ నిర్మాణం విశాఖలో జరుగుతుంది అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం విశాఖపట్టణంలో పర్యటించారు. కైలాసపురంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణపనులకు సీఎం వైఎస్ జగన్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ...విశాఖపట్నం అభివృద్ధికి మరింత దోహదపడుతూ, మరింత మంచి జరిగిస్తూ ఆణిముత్యంలా నిలిచిపోయే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం అని అన్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్‌ నిర్మాణానికి విశాఖ వేదిక అయ్యింది అని చెప్పుకొచ్చారు. విశాఖ నగరం రూపురేఖలు మార్చే గొప్ప ప్రాజెక్టుగా ఇది నిలిచిపోతుంది’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

విశాఖ రూపురేఖలు మారతాయి

‘దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మాల్‌ నిర్మాణం మన విశాఖలో జరుగుతుంది. రూ.600 కోట్లతో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ మాల్‌ ద్వారా మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 8వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 13 ఎకరాల్లో మాల్‌ నిర్మాణం జరిగిన తరువాత మిగిలిన 4 ఎకరాల్లో రాబోయే రోజుల్లో ఫేస్‌–2 కింద ఐటీ స్పేస్‌ క్రియేట్‌ చేయనున్నారు అని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్‌ స్టాండెడ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. వీటన్నింటి ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగు అవుతాయి. 2.5 లక్షల ఎస్‌ఎఫ్‌టీలో ఐటీ స్పేస్‌ రావడంతో కనీసం మరో 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని సీఎం వెల్లడించారు. ఇవన్నీ రాబోయే రోజుల్లో విశాఖను గ్లోబల్‌ చాట్‌లో పెట్టడంలో ఉపయోగపడే కార్యక్రమాలు అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఇనార్బిట్ మాల్ కార్యక్రమాన్ని సాధ్యం చేసిన నీల్‌ రహేజా, సీఈవో రజినీశ్‌ మహజన్, సీవోవో శ్రవణ్‌కుమార్‌లకు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 5స్టార్‌ హోటల్స్‌ నిర్మించిన సంస్థలు మన విశాఖలో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. మన రాష్ట్రంలో రాజ్‌ విల్లాస్‌ మాదిరిగా ఇటీవల ఒబేరాయ్‌ సంస్థ సూపర్‌ లెగ్జరీ రిసార్ట్స్‌ నిర్మాణానికి భూమిపూజ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మైఫేర్‌ సంస్థ 7స్టార్‌ లెగ్జరీ రిసార్ట్‌ నిర్మించబోతుంది అని తెలిపారు. అదే కోవలో మాకు కూడా సపోర్టు చేస్తే మేమూ లెగ్జరీ రిసార్ట్స్‌ నిర్మిస్తామని నీల్‌ రహేజా ఆసక్తి చూపారు. రాబోయే రోజుల్లో రహేజా గ్రూప్‌ కూడా 7స్టార్‌ లెగ్జరీ రిసార్ట్స్‌ నిర్మించనున్నారు. రహేజా సంస్థకు అన్ని విధాలుగా సపోర్టు చేస్తాం. ఒక్క ఫోన్‌కాల్‌ దూరంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. వీటన్నింటి ద్వారా విశాఖపట్నం రూపురేఖలు మారనున్నాయి అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. మరోవైపు హిందూపూర్‌లో కూడా 350 ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టులో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్‌ పార్కు ద్వారా 15 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్టుకు అన్ని రకాలుగా అడుగులు ముందుకువేశాం. ఆ ప్రాజెక్టుకు సపోర్టు చేస్తే యుద్ధప్రాతిపదికన టేకప్‌ చేస్తామని చెప్పారు. దానికి సంపూర్ణ సహకారాలు అందిస్తాం’ అని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం

విశాఖ పర్యటన సందర్భంగా మొత్తం రూ.864.88 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సీఎం జగన్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రూ.135.88 కోట్లతో జీవీఎంసీ చేపడుతున్న ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌లో పలు నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఏయూ క్యాంపస్‌లో సుమారు రూ.21 కోట్లతో స్టార్టప్‌ టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ హబ్‌ (ఏ హబ్‌)ను అభివృద్ధి చేశారు. 2025 నాటికి 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద ఇన్నొవేషన్‌ హబ్‌గా దీన్ని తీర్చిదిద్దనున్నారు. విభిన్న రంగాలకు చెందిన ఇంక్యుబేషన్‌ సెంటర్‌తోపాటు ఎనెక్స్‌ సెంటర్స్, ప్రోటోటైపింగ్‌/మేకర్స్‌ ల్యాబ్, స్టూడెంట్‌ ఐడియేషన్‌ సెంటర్లను అభివృద్ధి చేయనున్నారు. రూ.44 కోట్లతో ఫార్మా కంపెనీల కోసం 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఫార్మా ఇంక్యుబేషన్, బయోలాజికల్‌ మానిటరింగ్‌ హబ్‌ను సీఎం ప్రారంభించారు.

Advertisement

Next Story