పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం.. cm-jagan

by Javid Pasha |   ( Updated:2023-01-12 10:54:12.0  )
పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం.. cm-jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.విశాఖపట్నంలో నిర్వహించనున్న రెండు ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లుపై గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి నెలలో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు, జీ-20 సదస్సు ఏర్పాట్లపై సీఎం జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలమని ఈ విషయాన్ని పెట్టుబడుదారులకు తెలియజేయాలని సూచించారు. రాష్ట్రంలో వాస్తవిక పెట్టుబడులే లక్ష్యంగా ఈ రెండు సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ రెండు సదస్సులకు విశాఖపట్నం వేదిక కానున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. మరోవైపు ఈ సదస్సులకు వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యే ప్రతినిధుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

కొత్త తరహా ఉత్పత్తుల తయారీకి ఏపీ వేదిక కావాలి

మార్చి 3–4 తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సదస్సు నిర్వహించాలన్నారు. 2014–2019 మధ్య రూ. 18.87 లక్షల కోట్లకు ఎంఓయూలు చేసుకుంటే వాస్తవానికి ఆ మధ్యకాలంలో ఏడాదికి పెట్టుబడులు సగటున రూ.11,994 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. 2019–2022 మధ్య సగటున ఏడాదికి పెట్టుబడులు రూ. 15,693 కోట్లు వచ్చాయని వెల్లడించారు. 2019 జూన్‌ నుంచి ఇప్పటివరకూ రూ.1,81,821 కోట్ల పెట్టుబడులురాగా, 1,40,903 మందికి ఉద్యోగాలు వచ్చాయని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా కార్యక్రమం రూపొందించాలని సీఎం జగన్ సూచించారు. కొత్త తరహా ఇంధనాల తయారీ సహా ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరహా ఉత్పత్తుల తయారీకి ఏపీ వేదిక కావాలని.. దీనికి గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఊతం ఇవ్వాలని సూచించారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంగా వివిధ దేశాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తామని అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. విదేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడున్న పారిశ్రామిక వాడలను పరిశీలించాలని.. వాటి నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అలాగే ఆ దేశాల్లో ఎంఎస్‌ఎంఈలు నడుస్తున్న తీరుపై అధ్యయనం చేయాలని.. వాటి నిర్వహణా పద్ధతులను మన రాష్ట్రంలో అవలంభించడంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.


జీ-20 సదస్సుకు 250మంది హాజరు

విశాఖపట్నంలో జి–20 సన్నాహక సదస్సు కోసం ఏర్పాట్లు తదితర అంశాలపైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. అయితే ప్రపంచదేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరవుతారని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఒక్కొక్క జీ–20 సభ్యదేశం నుంచి 6గురు చొప్పున హాజరవుతారని... అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున హాజరవుతారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 100 మంది ప్రతినిధులు హాజరవుతారని మార్చి 28–29 మధ్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూపు సమావేశం జరుగుతుందని సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించాలి

జీ-20 సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అందుకు వేదిక అయిన విశాఖపట్నం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అవసరమైన రోడ్లు, సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రధాన జంక్షన్లు, బీచ్‌ రోడ్డులో సుందరీకరణ పనులు చేపట్టాలని... ఒక్క ఈ సమావేశం సందర్భంగానే కాదు, అన్ని రోజుల్లోనూ ఇవి ఇలాగే ఉండేలా తగిన కార్యాచరణ చేయాలని ఆదేశించారు. ఆతిథ్యం, రవాణా తదితర ఏర్పాట్లల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని.. ఏర్పాట్లుకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు సౌలభ్యంగా ఉండేందుకు ఒక మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్టు అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతినిధులు పర్యాటక ప్రదేశాల సందర్శన సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు బాగా ఉండేలా చూసుకోవాలని... ఆయా పర్యాటక ప్రదేశాల వద్ద ఆహ్లాదకర పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతినిధులకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని.. పెట్టుబడులకు ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రతినిధులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.

Also Read....

యువతతోనే రాజకీయాల్లో మార్పు.. జనసేన నేత నాగబాబు

Advertisement

Next Story

Most Viewed