యాదవులకు వైసీపీ తీరని ద్రోహం.. జగన్ బీసీ మంత్రం ఉత్తుత్తిదేనా?

by GSrikanth |   ( Updated:2024-03-17 07:28:49.0  )
యాదవులకు వైసీపీ తీరని ద్రోహం.. జగన్ బీసీ మంత్రం ఉత్తుత్తిదేనా?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రాలో పెద్ద కులాలలో ఒకటి, విశాఖ నగరంలో మెజారిటీ కులస్థులైన యాదవులకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొండి చేయిచూపింది. యాదవులకే ప్రాధాన్యత అని పదే పదే చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ శనివారం ప్రకటించిన జాబితాలో టికెట్ లేకుండా చేసింది. గత రెండు ఎన్నికలలో విశాఖ తూర్పు నియోజక వర్గాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ యాదవులకు కేటాయిస్తూ వచ్చింది. ఆ రెండు ఎన్నికలలో తెలుగుదేశం గాజువాకను యాదవులకు కేటాయించింది. ఆ ఎన్నికలలో కూడా ఈ రెండు ప్రధాన పార్టీల సామాజిక సమీకరణలు ఇలాగే వుంటాయని భావించారు. నాలుగు నెలల క్రితం వరకూ యాదవ వర్గానికి చెందిన అక్రమాని విజయనిర్మల వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖ తూర్పు నియోజక వర్గ సమన్వయకర్తగా వున్నారు. ఆమె స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను తీసుకురావడంతో గాజువాకలో స్థానిక కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్రరావుకు అవకాశం కల్పించారు. ఇప్పడు అనకాపల్లిలో సీటు కోల్పోయిన రాష్ర్ట మంత్రి గుడివాడ అమర్నాధ్ కోసం ఆయనను కూడా తీసేయడంతో యాదవులకు అధికార పార్టీ తీరని ద్రోహం చేసినట్లైంది.

యాదవులకు వైసీపీ తీరని ద్రోహం..

విశాఖ నగరంలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, గాజువాక, భీమిలి నియోజక వర్గాలు యాదవులకు అనుకూలమైనవి. విశాఖకు చెందిన పల్లా సింహాచలం, రాజానా రమణి, పిన్నింటి వరలక్ష్మీ, పల్లా శ్రీనివాస్‌లు శాననసభ్యులుగా ఎన్నికయ్యారు. రాజానా రమణి మేయర్‌గా కూడా చేశారు. అక్రమాని విజయనిర్మల వుడా చైర్ పర్సన్‌గా పనిచేశారు. ప్రస్తుత మేయర్ హరి వెంటక కుమారి యాదవ కులస్ధురాలే. ఆ ఎన్నికలలో అక్రమాని విజయ నిర్మల, హరి వెంకట కుమారిల పేర్లను పరిశీలించారు. గాజువాక కాకపోతే విశాఖ ఉత్తర లేదా భీమిలి సీట్లలో ఏదో ఒకటి ఇస్తారని భావించారు. అయితే, యాదవులకు సీటు లేకుండానే తుది జాబితా విడుదలైపోయింది.

మా బీసీలు అంటూనే ద్రోహం..

యాదవులు మెజారిటీ వున్న విశాఖలో ఒక్క ఎమ్మెల్యే సీటును యాదవులకు కేటాయించకపోవడం పట్ల ఆ సామాజిక వర్గ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా బీసీలు అని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి యాదవులకు తీరని ద్రోహం చేశారని విశాఖలోని యాదవులే గాక ఉత్తరాంధ్రా యాదవులంతా ఏకమై వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఓడించాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు వచ్చిన నాలుగు సీట్లలో ఒకటి యాదవులకు ఇచ్చిందని, తెలుగుదేశం పార్టీ కూడా విశాఖ పార్లమెంటు పరిధిలో ఒక సీటు యాదవులకు కేటాయించిందని ఆయన శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే యాదవులకు ద్రోహం చేసిందని, దీనికి యాదవులంతా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.


Read More..

ప్రకటించగానే అభ్యర్థులు కారు!

Advertisement

Next Story