AP News:నటి వేధింపుల కేసు పై..సీఎం చంద్రబాబు సీరియస్​

by Jakkula Mamatha |   ( Updated:2024-08-29 10:57:59.0  )
AP News:నటి వేధింపుల కేసు పై..సీఎం చంద్రబాబు సీరియస్​
X

దిశ, డైనమిక్​బ్యూరో:బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కేసుపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆమెను వేధించిన వారిపై చర్యలు చేపట్టాలని డీజీపీ ద్వారకా తిరుమల రావును ఆదేశించారు. ఆమె నుంచి ఆన్​లైన్​లో ఫిర్యాదు తీసుకోవాలని సూచించారు. వెంటనే సమగ్ర నివేదిక అందించాలని చెప్పారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు నిమిత్తం అప్రమత్తం అయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ లకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ రోజు సచివాలయంలో పలు సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి దృష్టికి ముంబై నటి వేధింపుల కేసు వచ్చింది.

దీంతో ఆయన సీరియస్​ అయ్యారు. ఉన్నత స్థాయి విచారణకు ఆయన ఆదేశించారు. దీంతో పోలీసులు అలర్ట్​ అయ్యారు. ముంబైకి పోలీసుల బృందాన్ని పంపిస్తామని విజయవాడ సీపీ తెలిపారు. కేసును క్షుణ్నంగా పరీలిస్తామని ఆయన తెలిపారు. నిజాలు వెలికి తీస్తామని ఆయన వెల్లడించారు. సీనియర్​ ఐపీఎస్​ అధికారుల పై ఈ కేసులో ఆరోపణలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఐపీఎస్​లపై ఉన్న ఆరోపణలపై డీజీపీతో చర్చిస్తానని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు వెల్లడించారు. డీజీపీ ఆదేశాల మేరకు సీనియర్​ ఐపీఎస్​లపై విచారణ ఉంటుందని తెలిపారు. రాత పూర్వకంగా ఫిర్యాదు అందనప్పటికీ వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేపడతామని ఆయన తెలిపారు.

ఏమిటి కేసు..?

ముంబైకి చెందిన నటి జత్వానీకి విజయవాడకు చెందిన ఓ వైసీపీ నేత విద్యాసాగర్​తో దాదాపు 9 ఏళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతనికి పలువురు అమ్మాయిలతో సంబంధం ఉందని తెలిసి దూరం పెట్టింది. అప్పటి నుంచి అతను అసభ్య సందేశాలతో వేధిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌లో ఆమె కుటుంబ సభ్యులపై విద్యాసాగర్‌ తప్పుడు కేసు పెట్టాడని ఆమె ఆరోపణ. ఓ ఫోర్జరీ డాక్యుమెంట్​చూపి తనపై కేసు పెట్టినట్లు ఆమె గతంలో వాపోయింది.

ఆ కేసు ఆధారంగా ఓ ఐపీఎస్​ అధికారి, ఇద్దరు ఏసీపీలు సిబ్బంది కలిసి ఫిబ్రవరిలో ముంబై వెళ్లి ఆ నటిని, ఆమె కుటుంబ సభ్యులను విజయవాడకు తీసుకు వచ్చి మూడు రోజులు ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్‌ అతిథిగృహంలో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. కాదంబరి పై భౌతికంగా దాడులు చేశారు. ఫిబ్రవరి 6న ఆమెను, ఆమె తల్లిదండ్రులను రిమాండుకు పంపించారు. ఈ కేసు వెనుక అప్పటి ప్రభుత్వ సలహాదారు, పోలీసు అధికారుల పాత్ర ఉందని బలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయం సంచలనం సృష్టించడంతో ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్‌ విభాగం నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది ముంబై నటి నేరుగా వచ్చి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులో భాగస్వాములైన ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది.

Advertisement

Next Story

Most Viewed