2023-24 టీటీడీ బడ్జెట్ ఇదే...!

by srinivas |   ( Updated:2023-03-22 16:31:50.0  )
2023-24 టీటీడీ బడ్జెట్ ఇదే...!
X

దిశ, తిరుపతి: 2023- 24 ఆర్థిక సంవత్సరానికి రూ 4,411.68 కోట్ల బడ్జెట్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిందని ఆయన వివరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలసి బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ 2023-24 బడ్జెట్ ఆమోదంతో పాటు కొన్ని పరిపాలనా పరమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పార. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల ఆ వివరాలను వెల్లడించలేక పోయామన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయం మార్చినందువల్ల సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, ఈ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

‘కోవిడ్ తరువాత హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కోవిడ్‌కు ముందు ఏడాదికి రూ.1200 కోట్లు కానుకలు లభించేవి. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం రూ.1500 కోట్ల దాకా పెరిగింది. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు పెరిగాయి. భక్తుల కోరిక మేరకు కోవిడ్ సమయంలో వర్చువల్ సేవా టికెట్లు ఆన్ లైన్‌లో జారీ చేశాం. తరువాత కూడా భక్తుల కోరిక మేరకు ఈ సేవలు కొనసాగించాలని నిర్ణయించాం. తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం ఏప్రిల్ ఆఖరు నాటికి పూర్తి చేయించి ముఖ్యమంత్రి వై‌ఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తాం.అలిపిరి నుండి వకుళామాత ఆలయం వరకు కొత్తగా రోడ్డు మంజూరు చేశాం.’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఏప్రిల్ 5వ తేదీ ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి కళ్యాణోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి వై‌ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వేసవిలో మూడు నెలలు భక్తుల రద్దీ బాగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల వీఐపీల రెఫరల్స్ బాగా తగ్గించాలని కోరుతున్నాం. శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడా తగ్గించి ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తాం. తిరుమలలో భక్తుల అవసరాలకు అనుగుణంగా లడ్డూ కాంప్లెక్స్ వద్ద 30 అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి రూ 5.25 కోట్లు మంజూరు చేశాం’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

తమిళనాడు రాష్ట్రం ఊలందూరు పేటలో దాత విరాళంతో నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రూ 4.70 కోట్లతో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి నిర్ణయించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుప ఎస్‌జి‌ఎస్ ఆర్ట్స్ కళాశాల పడమరవైపు మూడో అంతస్తు నిర్మాణం, ల్యాబ్ ఆధునీకరణ, గ్రంథాలయం, ఇండోర్ గేమ్స్ భవనాల నిర్మాణం తదితర పనుల కోసం రూ. 4.71 కోట్లతో టెండర్లు ఖరారు చేశాం. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్‌లో పని చేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులతో కలిపి దర్శన వసతి, రాయితీపై రూ 20 చొప్పున నెలకు 10 లడ్డూలు అందించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : Ugadi Asthanam: శ్రీవారి ఆలయంలో ఘనంగా ఉగాది ఆస్థానం

Advertisement

Next Story

Most Viewed