చిత్తూరు జిల్లాలో భారీ వర్షం..మండు వేసవిలో వర్షంతో చల్లబడిన వాతావరణం

by Disha Web Desk 18 |
చిత్తూరు జిల్లాలో భారీ వర్షం..మండు వేసవిలో వర్షంతో చల్లబడిన వాతావరణం
X

దిశ ప్రతినిధి,చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంట నుంచి గంటన్నర పాటు ఉరుములు, మెరుపులు, పెను గాలులతో కూడిన వర్షం ఏకధాటిగా కురిసింది. ఈ వర్ష ప్రభావంతో 45 డిగ్రీల వరకు ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. దీంతో వేడిగాలుల నుంచి చల్లని వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గంలోని పూతలపట్టు, ఐరాల, బంగారుపాలెం, తవణంపల్లి, యాదమరి మండలాలు జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పెనుమూరు, జీడీ నెల్లూరు, వెదురు కుప్పం మండలాలతో పాటు చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని గుడిపాల,చిత్తూరు రూరల్, చిత్తూరు నగరం, పలమనేరు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఈ వర్షం కురిసింది.

ప్రధానంగా పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గంలో 30 నుంచి 40 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే విధంగా కురిసింది. ఇదిలా ఉండగా గత నెల రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం అందులోనూ నిన్నటి వరకు వారం రోజుల పాటు 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కపోతతో పాటు వేడి గాలుల వల్ల జనం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు. మే నెలలో ఈ స్థాయిలో వర్షం పడటంతో ఉష్ణోగ్రతలు ఒకసారి గా తగ్గడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగే స్థాయిలో వర్షపు నీరు ప్రవహించింది. ముఖ్యంగా పూతలపట్టు మండల కేంద్రంతో పాటు పరిసరాల్లోని పలు గ్రామాల్లో సుమారు రెండు పదుల వర్షం కురిసినట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా మామిడి రైతులకు ఈ వర్షం ఎంతగానో ఉపయోగపడుతుంది. మామిడి పంటలో నాణ్యత పెరగడమే కాకుండా మామిడి పంటను ఆశించే చీడ పీడలు కూడా వదిలిపోయే అవకాశం ఉంది. దీంతో మామిడి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed