TDP Leader Chintakayala Vijay : సీఐడీ విచారణకు చింతకాయల విజయ్

by Nagaya |   ( Updated:2023-01-30 08:53:44.0  )
TDP Leader Chintakayala Vijay : సీఐడీ విచారణకు చింతకాయల విజయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సీఐడీ రీజినల్ ఆఫీస్‌కు చింతకాయల విజయ్ తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు. చింతకాయల విజయ్ సీఐడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజాతోపాటు టీడీపీ కీలక నేతలు సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే పోలీసులు వారందరినీ నిలిపివేశారు. చింతకాయల విజయ్, ఆయన తరఫు న్యాయవాదిని విచారణ నిమిత్తం కార్యాలయంలోకి పంపించారు. ఇకపోతే న్యాయవాది సమక్షంలోనే చింతకాయల విజయ్‌ను విచారించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే చింతకాయల విజయ్ ఐటీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే భారతీ పే అంటూ దుష్ప్రచారం చేశారని అభియోగాలపై చింతకాయల విజయ్‌‌పై గతేడాది సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లికి సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అయితే అప్పటికే షెడ్యూల్ బిజీగా ఉన్న నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతితో ఈరోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు.

సీఐడీ విచారణకు సహకరిస్తా: చింతకాయల విజయ్

చిన్న పిల్లలను కూడా సీఐడీ అధికారులు బెదిరించారని చింతకాయల విజయ్ ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి విచారణ హైకోర్టులో కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. కోర్టు అనుమతితోనే తాను విచారణకు హాజరవుతున్నట్లు తెలిపారు. తనను మెటీరియల్ ఏమీ అడగవద్దని కోర్టు ఆదేశించిన విషయాన్ని వెల్లడించారు. సీఐడీ విచారణకు సహకరించాలనే ఉద్దేశంతోనే తాను ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం బీసీలపై కక్ష్య గట్టిందని ఆరోపించారు. సెంటు భూమి కోసం తమ ఇంటిపై 500 మంది పోలీసులతో దాడి చేశారని.. అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందని చింతకాయల విజయ్ ఆరోపించారు.

Read more:

సీఐడీ కేసులకు భయపడం..ఎదుర్కొంటాం

Advertisement

Next Story