ఆదివాసీలపై ‘అటవీశాఖ’ దురాగతం!

by Mahesh |
ఆదివాసీలపై ‘అటవీశాఖ’ దురాగతం!
X

దిశ, కర్నూలు ప్రతినిధి: ఆదివాసీలపై అటవీశాఖ దురాగతానికి పాల్పడుతున్నది. చేయూత నందిచకపోగా, అటవీ ప్రాంతం నుంచి తరలించేందుకు కుట్రలు పన్నడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే గిరిజన గూడాల్లో పర్యటించిన అధికారులు, సిబ్బంది పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్పందించాల్సిన ఐటీడీఏ అధికారులు కనీసం చొరవ చూపడం లేదు. ఈ నేపథ్యంలో అటవీశాఖ తీరును నిరసిస్తూ చెంచులు ఆత్మకూరు అటవీ డివిజన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని శ్రీశైలం, ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి, నందికొట్కూరు, పగిడ్యాల, బండి ఆత్మకూరు, చాగలమర్రి, ఆళ్లగడ్డ, రుద్రవరం, వెలుగోడు, జూపాడుబంగ్లా, మహానంది మండలాల పరిధిలో 42 చెంచుల గూడాలు ఉన్నాయి.

అందులో 8,160 మంది గిరిజనులు, 1682 జాబ్ కార్డులుండగా 3, 272 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎలాంటి ఉపాధి పనులకు నోచుకోవడం లేదు. అటవీ ఉత్పత్తుల పై ఆధారపడి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. బ్రిటిష్ కాలంలో కేటాయించిన పొలాలను ఇప్పటకీ చూపలేదు. కొన్నిచోట్ల చూపినా కౌలుకిచ్చి ఆ పొలాలకు వారే కాపలాగా వెళ్తున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. గూడేల్లో ఉపాధి పనులు చేపట్టేందుకు అటవీశాఖ అధికారులే అడ్డు చెబుతున్నారు.

అటవీశాఖ తీరుపై నిరసన

కొత్తపల్లె మండలంలోని చదరం పెంట, పాలెం చెరువు, ఎర్రకుంట చెంచు గూడేలకు చెందిన 40 కుటుంబాలకు రెండు, మూడెకరాల చొప్పున 15 ఏళ్ల క్రితం కలెక్టర్, ఐటీడీఏ పీఓ, తహసీల్దార్ చేతుల మీదుగా ఆర్ఓఎఫ్ఆర్ లో భాగంగా దాదాపు పట్టాలిచ్చారు. అప్పటి నుంచి భూములను సాగు చేసుకుంటున్నారు. అయితే, వివిధ రకాల కారణాలు చూపుతూ ఆ పొలాలను బలవంతంగా లాక్కునేందుకు కుట్రలు పన్నుతున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

అటవీ అధికారులు ఆ పొలాల్లో కాలువ తీసి ట్రెంచ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. దిక్కుతోచని చెంచులు తమ భూములు తమకివ్వాలని కోరుతూ బుధవారం శ్రీశైలం నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరు పట్టణంలోని డీఎఫ్ఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. స్పందించిన కిందిస్థాయి అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఐటీడీఏ అధికారులు చొరవ తీసుకుని చెంచులకు అండగా నిలవాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed