నేడు తిరుపతికి చంద్రబాబు.. నాలుగు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు

by Mahesh |
నేడు తిరుపతికి చంద్రబాబు.. నాలుగు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీసిటీలో పలు కంపెనీల భూమిపూజ, ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరుపతికి ఉండవల్లి లోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. ఉదయం 11:30 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీసిటీకి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే మరో ఏడు సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. మొత్తం రూ.900 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2,740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో రూ.1,213కోట్ల పెట్టుబడులకు సంబంధించి నాలుగు ప్రముఖ కంపెనీలతో అక్కడే ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతారు. శ్రీసిటీ పర్యటన అనంతరం నెల్లూరు జిల్లాలో సోమశిల సాగునీటి ప్రాజెక్టును చంద్రబాబు సందర్శిస్తారు. అనంతరం సాయంత్రానికి ఉండవల్లి చేరుకుంటారు.

ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత భద్రతా ఏర్పాట్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన దృష్ట్యా, కార్యక్రమం సజావుగా, విజయవంతమయ్యేలా పోలీసు శాఖ విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హెలిపాడ్, శంకుస్థాపన చేయు ప్రదేశాల వద్ద పటిష్టమైన బారికేడ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులకు సూచించారు. సేఫ్ హౌస్, సేఫ్ హాస్పిటల్ లను పరిశీలించి, అక్కడ కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తూ, వైద్యులు, వైద్య సామగ్రి అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులను కోరారు.

Advertisement

Next Story

Most Viewed