క్యాసినో నిర్వహణ నిజమే.. వీడియోలతో సహా దొరికిన మంత్రి

by Disha Newspaper Desk |
క్యాసినో నిర్వహణ నిజమే.. వీడియోలతో సహా దొరికిన మంత్రి
X

దిశ, ఏపీ బ్యూరో : గుడివాడలో మంత్రి కొడాలి నాని కి చెందిన కే కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో నిర్వహించింది వాస్తవమేనని టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ స్పష్టం చేసింది. క్యాసినో నిర్వహించి మంత్రి కొడాలి నాని అడ్డంగా దొరికిపోయారని టీడీపీ వ్యాఖ్యానించింది. క్యాసినో ఆడించినట్లు, ఆడినట్లు వీడియోలతో సహా మొత్తం ఆధారాలు దొరికిన మంత్రి ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ ఎద్దేవా చేసింది. ఈ క్యాసినో వ్యవహారంలో సీఎం వైఎస్ జగన్ మౌనం వహించడం సరికాదని... ఇప్పటికైనా పెదవి విప్పాలని టీడీపీ స్ట్రాటజీ కమిటీ డిమాండ్ చేసింది.

క్యాసినో నిర్వహణ నిజమే

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆ పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. గుడివాడ క్యాసినో నిర్వహణ, రాష్ట్రంలోని ఇతర అంశాలపై కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా టీడీపీ నిజనిర్ధారణ కమిటీ చంద్రబాబు కు నివేదికను అందజేసింది. సంక్రాంతి పండుగ వేళ గుడివాడలో క్యాసినో, జూదం, పేకాట, అసభ్యకర నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని నిజనిర్ధారణ కమిటీ తమ నివేదికలో పొందుపరిచారు. ఈ వ్యవహారంలో రూ.500 కోట్లు చేతులు మారాయని ఆరోపించింది. ఇకపోతే మంత్రి కొడాని నానికి చెందిన కె కన్వెన్షన్‌లో క్యాసినో నిర్వహించారని ఆరోపిస్తూ టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడలో పరిశీలనకు వెళ్లడం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే కమిటీ సభ్యులు సోమవారం చంద్రబాబు కు నివేదిక అందజేశారు.

జాతీయ స్థాయిలో పోరాటం చేయాలి

గుడివాడ క్యాసినో అంశంపై టీడీపీ నేతలు రాజీలేని పోరాటం చేశారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, మేధావులు, ప్రముఖులు జన్మించిన గుడివాడను కాసుల కోసం కక్కుర్తిపడి క్యాసినో క్యాపిటల్‌గా కొడాలి నాని మారుస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నిజ నిర్ధారణకు వెళ్లిన పార్టీ నేతలపై దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. క్యాసినో వంటి విష సంస్కృతి పై పోరాటం కొనసాగించాల్సిందేనని పార్టీ స్ట్రాటజీ కమిటీ నిర్ణయించింది. ఈ వ్యవహారంలో వందల కోట్లు చేతులు మారాయని దీనిపై వివిధ జాతీయ ఏజెన్సీలకు, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు. వైసీపీ నేతల కనుసన్నల్లో, మంత్రికి చెందిన కన్వెన్షన్ సెంటర్‌లో గ్యాంబ్లింగ్ ఆడిన వీడియోలపై ముఖ్యమంత్రి స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మంత్రి కొడాలి తన బూతులతో, ఎదురు దాడితో జరిగిన తప్పులను కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారని అది సాధ్యం కాదన్నారు. ఈ విషయానికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చంద్రబాబు అన్నారు.

పోలీస్ కస్టడీలో దళిత మహిళకు చిత్రహింసల పై ఆగ్రహం

ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో దళిత మహిళను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడాన్ని టీడీపీ స్ట్రాటజీ కమిటీ ఖండించింది. ఈ దారుణ ఘటనలో కేవలం సదరు పోలీసులను సస్పెండ్ చేస్తే సరిపోదని... బాధ్యులపై అట్రాసిటీ కేసులు పెట్టి విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే చిత్తూరులో ఇలాంటివి నాలుగు ఘటనలు జరిగినట్లు కమిటీ వెల్లడించింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచకపోగా...వారిని బ్లాక్ మెయిల్ చేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని స్ట్రాటజీ కమిటీ అభిప్రాయపడింది. ఉద్యోగులపై సోషల్ మీడియాలో, మీడియాలో ప్రభుత్వమే తప్పుడు ప్రచారం చేయించడం దుర్మార్గమని వ్యాఖ్యానించింది. ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలపాలని టీడీపీ నిర్ణయించింది.

స్కూళ్లకు సెలవులు ఇవ్వాల్సిందే

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రమాదంలో పడేసేలా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఇది మంచి పద్ధతి కాదని అభిప్రాయపడింది. తక్షణమే స్కూళ్లకు సెలవులు ప్రకటించి... విద్యార్థులు, తల్లిదండ్రులు మహమ్మారి బారిన పడకుండా చూడాలని టీడీపీ సూచించింది.

వైసీపీది విధ్వంస పాలన

దేశంలోనే మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో వైఎస్ జగన్ పేరు లేకపోవడం రాష్ట్రంలో విధ్వంస పాలనకు నిదర్శనమని టీడీపీ స్ట్రాటజీ కమిటీ అభిప్రాయపడింది. దేశంలో బెస్ట్ సీఎం ల లిస్ట్ లో కనీసం టాప్ 20 లో కూడా సీఎం జగన్ పేరు లేదని విమర్శించారు. ఇది జగన్ పాలన తీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించింది. జగన్ పరిస్థితి, వైసీపీ గ్రాఫ్ దిగజారిపోతున్న.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమకు ఎక్కువ సీట్లు అంటూ సిగ్గు లేకుండా వైసీపీ అసత్య ప్రచారానికి దిగుతోందని చంద్రబాబు ఆరోపించారు. మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెరవెనుక సూత్రధారుల లెక్కలు తేల్చకుండా... కేసును కేవలం నలుగురికే పరిమితం చేసే కుట్ర జరుగుతుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తూ.. అధిక ధరలకు రైతులకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఎరువుల అధిక ధరలు, కొరతతో రైతాంగ ఇబ్బంది పడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని.. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

కోవిడ్ సేవల్లో ఎన్టీఆర్ ట్రస్ట్

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందని టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చంద్రబాబు తెలిపారు. కరోనా మెుదటి వేవ్, సెకండ్ వేవ్‌లలో టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజలకు అండగా నిలిచిందని... ఎంతోమందికి సేవలు అందించిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఇటీవల కాలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని చంద్రబాబు సమావేశంలో ప్రస్తావించారు. థర్డ్ వేవ్ సమయంలో కూడా ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుల ద్వారా, టెలిమెడిసిన్ విధానంలో కోవిడ్ బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని... ఈ సేవలను ప్రజలకు చేరువ చేయాలని టీడీపీ స్ట్రాటజీ కమిటీ నిర్ణయించింది.

Advertisement

Next Story