టీడీపీపై బీజేపీ బిగ్ స్కెచ్.. చంద్రబాబు తేల్చేసుకోవాల్సిన సమయం ఇదే..

by Javid Pasha |   ( Updated:2023-09-27 11:29:28.0  )
టీడీపీపై బీజేపీ బిగ్ స్కెచ్.. చంద్రబాబు తేల్చేసుకోవాల్సిన సమయం ఇదే..
X

ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపేందుకు ఉప్పందించింది కేంద్ర సర్కారు అని తేటతెల్లమవుతోంది. ఎన్డీయేలో భాగస్వామి అయిన జనసేన.. టీడీపీతో పొత్తును ఖరారు చేసింది. సీఎం జగన్​కు తెరచాటున సాయం చేస్తున్న ఢిల్లీ పెద్దలు మళ్లీ వైసీపీ అధికారాన్ని చేపట్టాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు కేసులపై ఇప్పటిదాకా స్పందించలేదు. అయినా ఆశ చావని టీడీపీ.. నేటికీ బీజేపీ సాన్నిహిత్యం కోసం వెంపర్లాడుతోంది. ఈ మూడు ముక్కలాటతో ఎవరు గెలిచినా.. ఓడినా గంపగుత్తగా 25 మంది ఎంపీల మద్దతు తమకే ఉండాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. అందుకే మూడు పార్టీలతో విన్యాసాలు చేయిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: తమతో స్నేహం చేసిన ఏ ప్రాంతీయ పార్టీనీ బీజేపీ వదల్లేదు. అకాలీదళ్​నుమాయం చేసింది. మహారాష్ట్రలో శివసేనను నిట్టనిలువునా చీల్చింది. వీళ్ల విష కౌగిలి నుంచి చావు తప్పి లొట్టబోయిన చందంగా బయటపడిన ఏఐడీఎంకే అసలు మీ పొత్తే వద్దంటూ దూరంగా జరిగింది. రాష్ట్రంలోని అధికార వైసీపీ ఈపాటికే కమలనాథుల గాఢ పరిష్వంగంలో ఉంది. ఏదైనా తేడా కొట్టి టీడీపీ బలపడితే వాళ్ల ఎంపీలు కూడా తనకే కావాలనే ఎత్తుగడను కాషాయ దళం అమలు చేస్తోంది. వైసీపీ, టీడీపీ మధ్య ఇప్పుడు జనసేన కీలకంగా ఎదిగింది. ఏదో ఒక బలహీనమైన ప్రాంతీయ పార్టీని దెబ్బకొట్టకుండా ఎదగలేమని బీజేపీ ఆది నుంచి భావిస్తోంది. అందులో భాగంగానే జగన్​ భుజంపై తుపాకి పెట్టి టీడీపీని టార్గెట్​ చేసింది.

మూడు పార్టీలనూ ఆడిస్తోంది..

కేంద్ర పెద్దలు ఇప్పటికీ సీఎం జగన్​కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆర్థిక సాయంతో పాటు ఆయనకు సంబంధించిన ఏ ఒక్క కేసు కూడా ముందుకు కదలకుండా బీజేపీ కట్టడి చేసిందనే భావన రాష్ట్రమంతా నెలకొంది. విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజల నెత్తిన పెద్ద ఎత్తున భారాలు మోపి మూలిగలు పీలుస్తోంది. ఇక్కడ తమకు ఎలాగూ ప్రజలు ఓట్లేయరని కమల నాథులు గ్రహించారు. అందుకే మూడు పార్టీలను గుప్పెట పట్టి జిమ్మిక్కులు చేస్తున్నారని ప్రజలకు అవగతమైంది. మూడు పార్టీలకు భిన్నంగా ప్రజలు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే పరిస్థితులకు అవకాశమివ్వకుండా అనేక భావోద్వేగాలను జనంలోకి నెడుతోంది. రింగ్​ మాస్టర్​ మాదిరిగా మూడు పార్టీలను ఆడిస్తోంది.

టీడీపీని తొక్కేసే వ్యూహం..

‘పసలేని కేసులతో టీడీపీ ముఖ్య నేతలను జైల్లో కుక్కి జనసేనాని పవన్​ను ముందుకు తీసుకురావాలి. జగన్​తో తలపడేట్లు చేయాలి. వైసీపీ మళ్లీ కుర్చీ ఎక్కాలి. కనీసం కొన్ని సీట్లయినా బీజేపీ – జనసేన – టీడీపీ పొత్తులో గెల్చుకోవాలి. ఆనక టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేయాలి..’ అనే వ్యూహంతో కాషాయ పార్టీ అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ధైర్యంగా ఎదురుదాడి చేయలేకపోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అటో ఇటో తేల్చుకోవాల్సిన తరుణం..

ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబుకు ఇలాంటి దుస్థితి ఎదురైతే మిగతా పార్టీలు తగిన స్థాయిలో స్పందించలేకపోతున్నాయి. చంద్రబాబు కొన్నేళ్ల నుంచి జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండడం.. బీజేపీ మీద ఆశలు పెంచుకోవడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా జాతీయ స్థాయిలో అటోఇటో తేల్చుకోకుంటే పార్టీని బతికించుకోవడం కష్టమని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారా.. ఇంకా ఊగిసలాట ధోరణితోనే కొనసాగుతారా? అనేది అటు పార్టీ శ్రేణుల్లో.. ఇటు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read More Latest updates of Andhra Pradesh News

Advertisement

Next Story

Most Viewed