భరతజాతిలో పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు భగత్ సింగ్: పవన్ కల్యాణ్

by Seetharam |
భరతజాతిలో పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు భగత్ సింగ్: పవన్ కల్యాణ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించి యావత్ భరత జాతిలో పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు షహీద్ భగత్ సింగ్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. భగత్ సింగ్‌ను అసేతు హిమాచలం గుండెల్లో పెట్టుకొంది అని కొనియాడారు. ఆ వీరుని జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘యవ్వన ప్రాయంలో ఉరికొయ్యను ముద్దాడిన ఆ యోధుడు భరత జాతికి అందించిన చైతన్యం అమూల్యమైనది. భగత్‌సింగ్ జీవితం నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలి. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా, స్వాతంత్రాలు భగత్‌సింగ్ లాంటి ఎందరో వీరుల ప్రాణ త్యాగాల ఫలం అని యువత ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి’ అని పవన్ కల్యాణ్ సూచించారు.

స్వామినాథన్ మృతి వ్యవసాయ రంగానికి తీరని లోటు

ఎంఎస్ స్వామినాథన్ మరణం భారత వ్యవసాయ రంగానికి తీరని లోటని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. స్వామినాథన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్థున్నట్లు తెలిపారు. మన దేశంలో హరిత విప్లవానికి ఊపిరి పోసి వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చారు అని కొనియాడారు. స్వామినాథన్ తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఎంఎస్ స్వామినాథన్ ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. స్వామినాథన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధిక దిగుబడి ఇచ్చే వరి, గోధుమ వంగడాల రూపకల్పన చేయడం వల్లే ఆ దిశగా ఎన్నో ప్రయోగాలు నేటికీ మన దేశంలో సాగుతున్నాయని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed