DSC Exams:డీఎస్సీ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే!

by Jakkula Mamatha |
DSC Exams:డీఎస్సీ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే!
X

దిశ ప్రతినిధి, చిత్తూరు: రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు రాబోయే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి అర్హులైన నిరుద్యోగ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్, చిత్తూరు నందు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా ఏడి శ్రీనివాసులు తెలిపారు. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం లక్ష రూపాయల లోపు ఉండాలని, TTC మరియు TET అర్హత కలిగిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. డీఎస్సీ శిక్షణలో సీట్ల కేటాయింపు ప్రకారం, బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం సీట్లు కేటాయించినట్లు వివరించారు. అదనంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 శాతం సీట్లు కేటాయించినట్లు తెలిపారు.

ఈ శిక్షణ రెండు నెలలు పాటు కొనసాగుతుందని శిక్షణ కాలంలో 75 శాతం హాజరు ఉన్న ప్రతి అభ్యర్థికి నెలకు రూ.1500 స్టైపెండ్, మెటీరియల్ కోసం రూ.1000 అందజేస్తామని తెలిపారు. బీఈడీ పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు ప్రొవిజినల్ సర్టిఫికేట్, 10వ తరగతి, ఇంటర్ మరియు డిగ్రీ మార్క్‌లిస్టులు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం (వార్షిక ఆదాయం రూ.1,00,000/- లోపు మాత్రమే), ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ మరియు 3 పాస్ పోర్ట్ సైజు ఫొటోలు జతపరచి తమ దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ లోపు అందజేయాలని కోరారు.

Advertisement

Next Story