AP Weather: ఏపీని వీడని వర్షాలు.. పొంచి ఉన్న మరో ముప్పు

by Rani Yarlagadda |
AP Weather: ఏపీని వీడని వర్షాలు.. పొంచి ఉన్న మరో ముప్పు
X

దిశ, వెబ్ డెస్క్: తుపాను తీరందాటి రెండ్రోజులవుతున్నా ఏపీని వర్షాలు (AP Rains) వీడటం లేదు. తీరందాటిన తుపాను వాయుగుండంగా బలహీన పడుతుండగా.. ఒంగోలు, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో, ఇటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలులో భారీ వర్షం కురవగా.. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన మార్గాల్లో రోడ్లపైకి నీరు చేరింది. బస్టాండ్ కూడలి, కర్నూల్ రోడ్డులో భారీగా వర్షపునీరు నిలిచింది. రాకపోకలకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

మరోవైపు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వాగుల ఉద్ధృతి పెరిగింది. దేవళంపేట - వెదురుకుప్పం ప్రధాన రహదారిపై మద్దెలవంక ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. జలాశయం కలుజు పారుతుండటంతో.. వాగుకు ఇరువైపులా వాహనాలు ఆగిపోయాయి. బాపట్ల జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో జోరువాన కురవడంతో పలు కాలనీల్లో నీళ్లు నిలిచాయి. చీరాల, బాపట్ల, వేటపాలెం, చినగంజాం, రేపల్లె, మేదరమెట్ల, అద్దంకి లో భారీ వర్షం కురిసింది.

ఏపీకి తుపాను ముప్పు తప్పిందనుకునే లోపే మరీ బాంబ్ పేల్చింది వాతావరణశాఖ. డిసెంబర్ 9 నుంచి 16వ తేదీ మధ్య తమిళనాడుని ఆనుకుని మరో అల్పపీడనం (Low Pressure) లేదా వాయుగుండం (Depression) ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే జరిగితే దాని ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తా జిల్లాలపైనే ఉండే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఈ వర్షాల బెడదేంటోనని వాపోతున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

Advertisement

Next Story