Yuvagalam: రాటు తేలిన నారా లోకేష్

by srinivas |
Yuvagalam: రాటు తేలిన నారా లోకేష్
X

దిశ, కదిరి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ 47 రోజులుగా రాష్ట్రంలో చేపట్టిన యువగళం పాదయాత్రతో రాటు తేలిపోయాడనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆయనకు మరింత కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ప్రారంభంలో నడకపై కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సుమారు 47 రోజుల కాలంలో 600 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఆదివారం కదిరి నియోజకవర్గం జోగన్నపేట వద్ద 600 మైలురాయి శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ వివిధ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలపై చర్చించి ఆయా అంశాలను బహిరంగ సభలో ప్రస్తావిస్తూ రావడం జరుగుతోంది.

ముఖ్యంగా సీఎం జగన్ సాధించింది ఏమీ లేదని చెప్పడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా కుప్పంలో జరిగిన ప్రారంభ సభలో తాము అధికారంలోకి వస్తే ఇసుకను ఉచితంగా అందిస్తామని చెప్పడం చాలా వరకు గ్రామస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ప్రత్యేక హోదా విషయంలో ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదంటూ చెప్పడం జరుగుతోంది. చాలావరకు చేతిలో పేపరు లేకుండా సమస్యలను ప్రజలకు చెబుతూ ప్రశ్నించడం కూడా ఆకట్టుకుంటోంది.

అయితే ఇప్పటికీ కొన్ని పదాలను నారా లోకేష్ సక్రమంగా పలకకపోవడం కొంత సమస్యగా ఉందని చెప్పవచ్చు. ఇందులో ఎన్నికల ముందు అనే పదాన్ని ఎన్నికల ముందల అనడం, తండ్రి చంద్రబాబు లాగా ప్రజల కోసం బదులుగా ప్రజల కోస్రం అనడం వంటి సమస్యలు వెంటాడుతూనేఉన్నాయి. ఏదేమైనా నారా లోకేష్ యువగళం పాదయాత్రతో రాజకీయంగా బాగానే రాటు తేలాడనే చర్చ సర్వత్రా సాగుతోందనేది వాస్తవం.

Advertisement

Next Story

Most Viewed