Anantapur: నిద్రిస్తున్న దంపతులపై ఘోరం... మంటల్లో కేకలు వేస్తూ..

by srinivas |   ( Updated:2023-06-18 11:10:16.0  )
Anantapur: నిద్రిస్తున్న దంపతులపై ఘోరం... మంటల్లో కేకలు వేస్తూ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: పల్నాడు జిల్లాలో అమర్‌నాథ్ హత్యాయత్నం ఘటన మరువకముందే అనంతపురం జిల్లా తాడిపత్రి సజ్జలదిన్నెలో దారుణం జరిగింది. ఆరుబయట నిద్రిస్తున్న దంపతులపై దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. నల్లపురెడ్డి, కృష్ణవేణి దంపతులు ఇంటి బయట నిద్రిస్తున్నారు. వారితోపాటు పూజిత అనే చిన్నారి కూడా నిద్రిస్తోంది. అయితే గాఢ నిద్రలో ఉండగా దంపతులపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో బాధితులు పెద్దగా కేకలు వేశారు. ఈ కేకలు విన్న స్థానికులు ఘటన స్థలానికి వచ్చే సరికి ముగ్గురూ మంటల్లో కాలిపోతూ కనిపించారు. స్థానికులు మంటలు ఆర్పినా అప్పటికే వారి శరీరమంతా కాలిపోయింది. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులకు కర్నూలుకు తరలించారు.

ప్రస్తుతం చిన్నారి పరిస్థితి మెరుగ్గానే ఉన్నా దంపతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధిత దంపతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఆ తాగుబోతుపైనే అనుమానాలు

అయితే ఈ దారుణ ఘటనకు పాల్పడింది దగ్గర బంధువు రమేశ్ రెడ్డి అయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లపురెడ్డి, కృష్ణవేణి దంపతులు పని చేసే మార్బుల్స్ కంపెనీలో రమేష్ రెడ్డి కూడా పని చేస్తారు. మద్యానికి బానిసైన రమేశ్‌రెడ్డిని మానేయాలని నల్లపురెడ్డి, కృష్ణవేణి దంపతులు పలుమార్లు సూచించారు. తననే మద్యం తాగొద్దంటారా అంటూ రమేష్ రెడ్డి కోపం పెంచుకున్నట్లు భావిస్తున్నారు. దీంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story