Breaking: అమరావతి నమూనా గ్యాలరీ ధ్వంసం

by srinivas |   ( Updated:2024-04-17 13:09:34.0  )
Breaking: అమరావతి నమూనా గ్యాలరీ ధ్వంసం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని నమూనాలు కనుమరుగవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో కళకళలాడిన అమరావతి ప్రాంతం.. ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాజధాని శోభ తప్పింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు ప్రకటించారు. ఆ మేరకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ఆ అంశం కోర్టుకు చేరడంతో వెనక్కి తగ్గారు.

కానీ ఏపీ రాజధాని అమరావతిలో మాత్రం ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. చంద్రబాబు కట్టిన ప్రజావేదికను కూల్చివేశారు. రాజధాని కోసం కట్టిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన శిలాఫలకం బోసి పోయింది. అయినా సరే ఆ ప్రాంత వాసులు అమరావతే రాజధాని అంటూ డిమాండ్ చేస్తునే ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. అయినా సరే రాజధానిని రూపుమానేందుకు దుండగులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.


తాజాగా ఉద్దండరాయునిపాలెంలో అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేశారు. అమరావతి శంఖుస్థాపన సమయంలో ఈ నమూనాను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో అమరావతి ఎలా ఉంటుందో తెలిసేలా నమూనా ఏర్పాటు చేశారు. అయితే ఈ నమూనాను దుండగులు ధ్వంసం చేశారు. దీంతో అమరావతి ప్రాంత రైతులు, టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నమూనా గ్యాలరీని వైసీపీ నాయకులే ధ్వంసం చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే అమరావతి రాజధాని నమూనా లేకుండా చేయాలనే పన్నాగం పన్నారని మండిపడుతున్నారు. ఈ ఎన్నికల్లో తాము అధికారంలో రావడం ఖాయమని.. అమరావతి రాజధానికి పూర్వ వైభవం తీసుకురావడం ఖాయమని టీడీపీ నేతలు అన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా రాజధానిని మార్చలేరని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed