వైసీపీ నాయకులకు కాంగ్రెస్ గాలం?.. రంగంలోకి అగ్ర నేతలు

by srinivas |   ( Updated:2024-07-13 08:04:15.0  )
వైసీపీ నాయకులకు కాంగ్రెస్ గాలం?.. రంగంలోకి అగ్ర నేతలు
X

దిశ ప్రతినిధి, కర్నూలు: ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభావం తగ్గింది. దీన్ని అవకాశంగా చేసుకుని పట్టు సాధించుకునేందుకు కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెట్టింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని గ్రాండ్‌గా నిర్వహించి కేడర్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసింది. మరో వైపు వైఎస్ఆర్ కు సన్నిహితంగా ఉన్న నేతలను, వైసీపీని వీడనున్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేపట్టినట్లు సమాచారం. చాపకింద నీరులా కాంగ్రెస్ తన పాచికలు పారేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు కాంగ్రెస్ అగ్ర నేతలకు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

కాస్త కష్టపడితే..

ఈ ఏడాది మేలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. అటు తెలంగాణ, ఇటు కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా బలమైన క్యాడర్ ను తయారు చేసుకునేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ తన ఖాతాను తెరవలేదు. కడపలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ షర్మిల 1,41,039 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. మిగతా చోట్లా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో నిలిచిన నేతలకు కొంతమేర ఓటర్లు అండగా నిలిచారు. ఇంకాస్త కష్టపడితే ప్రత్యర్థులతో పోటీ పడొచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన..

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ఆర్ వారసురాలు షర్మిల సీఎం అవుతారని ఈ నెల 8న విజయవాడలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కడప పార్లమెంట్ కు ఉప ఎన్నిక జరిగితే తానే స్వయంగా ప్రతి గ్రామం తిరుగుతానని, ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలనే సామెతను నిరూపితం చేస్తామని వ్యాఖ్యానించారు. ఈయన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌ల సారధ్యంలో వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ సన్నిహితులు, అలక నేతలను లక్ష్యంగా చేసుకుని వారిని పార్టీ చేర్చుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ అగ్రనేతలకు టచ్‌లో వైసీపీ నేతలు..

వైసీపీలో కీలకంగా పని చేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన సోదరులు, రాయలసీమలో పలువురు నేతలు కాంగ్రెస్ అగ్రనేతల టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఘోర పరాజయం చెందిన వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేదు. అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. మాజీ సీఎం జగన్ తో పాటు ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన ప్రధాన నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తప్పించింది. మరి కొందరిని వివిధ శాఖలకు కేటాయించింది. గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి పని పట్టే పనిలో టీడీపీ నిమగ్నమైంది. ఈ క్రమంలో చాలా మంది నేతలు తమ ఆస్తులు కాపాడుకునేందుకు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేయగా ఆ పార్టీ వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అలాంటి వారంతా కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ తమను చేర్చుకోదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు కూడా వారి కోసం తలుపులు తెరిచి ఉంచారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్నికలకు ముందు వైసీపీకి చెందిన నందికొట్కూరు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యేలు తోగూరు ఆర్థర్, మురళి, నంద్యాల వైసీపీ జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డితో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు. వారికి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం కల్పించింది. ఈ సారి రాష్ర్ట వ్యాప్తంగా వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని, 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ మరింత బలంగా ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story