ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్న నేతలు.. అదే కారణమా..?
దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీకి షాక్‌ల మీద షాక్ ఇస్తున్నారు ఆ పార్టీ కమిటీ సభ్యులు. పార్టీలో ప్రాధాన్యత లేదంటూ ఒక్కొక్కరుగా పార్టీని వీడితున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యస్థాపనే లక్ష్యమంటూ పార్టీ పెట్టిన షర్మిలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంటుంది. పార్టీని పటిష్టం చేద్దామనుకున్న షర్మిలకు రాజీనామాలు తలనొప్పిగా మారాయి. మొన్న ఇందిరా శోభన్… నిన్న చేవెళ్ల ప్రతాప్ రెడ్డి.. నేడు పాలమూరు జిల్లాకు చెందిన ఇబ్రహీం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, […]
దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీకి షాక్‌ల మీద షాక్ ఇస్తున్నారు ఆ పార్టీ కమిటీ సభ్యులు. పార్టీలో ప్రాధాన్యత లేదంటూ ఒక్కొక్కరుగా పార్టీని వీడితున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యస్థాపనే లక్ష్యమంటూ పార్టీ పెట్టిన షర్మిలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంటుంది. పార్టీని పటిష్టం చేద్దామనుకున్న షర్మిలకు రాజీనామాలు తలనొప్పిగా మారాయి. మొన్న ఇందిరా శోభన్… నిన్న చేవెళ్ల ప్రతాప్ రెడ్డి.. నేడు పాలమూరు జిల్లాకు చెందిన ఇబ్రహీం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. రాజీనామాల ఉపసంహరించుకునేలా నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి విఫలమవుతున్నట్లు సమాచారం. ఇలాగే కొనసాగితే తెలంగాణ పార్టీ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యమని పేర్కొంటూ వైఎస్ షర్మిలా.. వైఎస్ఆర్ టీపీని స్థాపించింది. పార్టీ పటిష్టతకోసం రాష్ట్ర కమిటీని ప్రకటించింది. అయితే పార్టీ కోసం కష్టపడుతున్న వారికి సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదనే పేర్కొంటూ రాజీనామాలు చేస్తున్నారు. ఇంకా పార్టీ ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్లక ముందే పార్టీ కార్యవర్గం రాజీనామాలు చేస్తుండటంతో పార్టీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి షర్మిల ప్రధాన అనుచరురాలిగా ఇందిరా శోభన్‌కు గుర్తింపు ఉంది. షర్మిల ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళ్లి పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేశారు. అయితే పార్టీలో కీలక పదవి వస్తుందని భావించినప్పటికీ అధికార ప్రతినిధిగానే బాధ్యతలను అప్పగించడంతో కొంత అసహనానికి గురయ్యారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగారు ఇప్పుడు అదే పదవి అప్పగించడంతో ప్రాధాన్యం దక్కలేదని రాజీనామా చేశారు. ఇందిరాశోభన్ బాటలోనే చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి పార్టీలో తగిన గుర్తింపు లేదని రాజీనామా చేయగా, ఆదివారం మహబూబ్ నగర్ పార్లమెంట్ కన్వీనర్ మహమ్మద్ ఇబ్రహీం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. దీంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో ఉన్న కమిటీ సభ్యులు కూడా ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. పార్టీకి మనుగడ ఉంటుందా? లేదా? పార్టీలో కొనసాగుదామా? లేకుంటే రాజీనామా చేద్దామా అని చర్చించుకుంటున్నట్లు పలువురు పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇందిరాశోభన్ రాజీనామాతో పాటు చేవెళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంట్ కన్వీనర్ ఇబ్రహీం పార్టీకి రాజీనామా చేయడంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిలకు రాజకీయంగా గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో చేరికలు లేకపోవడం, పేరున్న నేతలు కూడా పార్టీలో లేకపోవడంతో వైఎస్సార్ టీపీ రాష్ట్రంలో బలోపేతం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. షర్మిల లేకపోతే పార్టీని నడిపే వారే ఆ పార్టీలో కరువయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు వస్తాయని భావించినప్పటికీ ఎవరూ రాకపోవడం, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో పార్టీని వీడాలనుకున్న నేతలు సైతం ఆపార్టీలోనే ఉండిపోయారు. దీంతో వైఎస్ఆర్ టీపీలో ఆశించిన మేరకు ఇతర పార్టీల నేతలు చేరకపోవడం, ఉన్న నేతలు కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో ఆపార్టీ మనుగడ ఏంటనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది.